
నిజాయితీకే పట్టం కట్టారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ : వాస్తవాలు, నిజాయితీకి దక్కిన విజయమని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన తొలిసారి మాట్లాడారు. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నిజాన్ని నమ్ముకుని నడిస్తే ప్రపంచమే తమ వెంట వస్తుందన్నారు. నిజాయితీతో నడిస్తే ప్రపంచమే సహకరిస్తుందన్నారు.
ఎన్నికల్లో ఆప్ విజయం ప్రజలదిగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇంత పెద్ద విజయాన్ని తాను ఊహించలేదన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలను మళ్లీ చేయనని, నిష్పక్షపాతంగా పాలన అందిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో అవినీతిని ఏరిపారేద్దామని...అవినీతిపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అహంకారం వల్లే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటమి పాలయ్యాయని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.