ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : భారత భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల చావులను పావుగా వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ వాయిద్ తెలిపారు. అంత్యక్రియల్లో మిలిటెంట్లను అమరులుగా పేర్కొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నిఘా ఉంచుతామన్నారు. సోషల్ మీడియా వేదికగా మిలిటెంట్ల అంత్యక్రియల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారని వెల్లడించారు. మిలిటెంట్లను అమరులుగా కీర్తిస్తూ ముస్లిం యువతను రెచ్చగొట్టడం వల్ల మరెంతో మంది ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై వారి ఆటలు సాగనీయమనీ, పక్కా ప్రణాళికతో అలాంటి వారిని గుర్తించి కటకటాల పాలు చేస్తామని అన్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం..
కాగా, పోలీసులు తీసుకునే చర్యలను వివరించేందుకు వాయిద్ నిరాకరించారు. మిలిటెంట్ల అంత్యక్రియల్లో భారీగా జనం పోగవకుండా, ఆ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కాకుండా అడ్డుకుంటామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ‘తీవ్రవాదుల మృతికి సంతాపంగా వారి అనుయాయులు తుపాకీతో సెల్యూట్ తెలపడం ఆనవాయితీ, అయితే సంచలనం కోసం ఇటీవల ఒక మిలిటెంట్ అంత్యక్రియల్లో అతని తల్లితో గాల్లోకి కాల్పులు జరిపించార’ని వివరించారు. దాంతో ఆ వీడియో వైరల్ అయి అంత్యక్రియల్లో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని వెల్లడించారు. ఇలాంటి ఎత్తుగడలను అడ్డుకునేందుకే రంజాన్ మాసంలో కాల్పుల విరమణ పాటించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment