vaid
-
అంత్యక్రియల్లో ఆ వ్యాఖ్యలు చేస్తే జైలుకే
సాక్షి, న్యూఢిల్లీ : భారత భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల చావులను పావుగా వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ వాయిద్ తెలిపారు. అంత్యక్రియల్లో మిలిటెంట్లను అమరులుగా పేర్కొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నిఘా ఉంచుతామన్నారు. సోషల్ మీడియా వేదికగా మిలిటెంట్ల అంత్యక్రియల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారని వెల్లడించారు. మిలిటెంట్లను అమరులుగా కీర్తిస్తూ ముస్లిం యువతను రెచ్చగొట్టడం వల్ల మరెంతో మంది ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై వారి ఆటలు సాగనీయమనీ, పక్కా ప్రణాళికతో అలాంటి వారిని గుర్తించి కటకటాల పాలు చేస్తామని అన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం.. కాగా, పోలీసులు తీసుకునే చర్యలను వివరించేందుకు వాయిద్ నిరాకరించారు. మిలిటెంట్ల అంత్యక్రియల్లో భారీగా జనం పోగవకుండా, ఆ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కాకుండా అడ్డుకుంటామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ‘తీవ్రవాదుల మృతికి సంతాపంగా వారి అనుయాయులు తుపాకీతో సెల్యూట్ తెలపడం ఆనవాయితీ, అయితే సంచలనం కోసం ఇటీవల ఒక మిలిటెంట్ అంత్యక్రియల్లో అతని తల్లితో గాల్లోకి కాల్పులు జరిపించార’ని వివరించారు. దాంతో ఆ వీడియో వైరల్ అయి అంత్యక్రియల్లో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని వెల్లడించారు. ఇలాంటి ఎత్తుగడలను అడ్డుకునేందుకే రంజాన్ మాసంలో కాల్పుల విరమణ పాటించామని తెలిపారు. -
వనీ బ్రిగేడ్‌లో ఆఖరి కమాండర్ హతం
శ్రీనగర్, జమ్మూ కశ్మీర్ : హిజ్బుల్ మొజాహిదీన్(ఐఎమ్) ప్రముఖ ఉగ్రవాది బుర్హాన్ వనీ బ్రిగేడ్‌లోని ఆఖరి కమాండర్‌ను భారత భద్రతా దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. ఇప్పటికే పలువురు కీలక కమాండర్లను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. షోపియాన్ జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ బ్రిగేడ్‌లో ఆఖరివాడైన సద్దాం పద్దర్ మృతి చెందిన్నట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. షోపియాన్‌లో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. జైనాపుర ప్రాంతంలోని బడిగాం గ్రామంలో ఉగ్రవాదులు నక్కారనే సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. తీవ్రవాదుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు కార్డన్ సెర్ఛ్ ఆపరేషన్ చేపట్టగా.. భద్రతా బలగాల రాకను గమనించిన మిలిటెంట్లు కాల్పులకు దిగారు. ప్రతిగా రక్షక దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాగా, ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను, పోలీసు అధికారి గాయపడ్డారు. కొంత కాలంగా తీవ్రవాద సంస్థలో పని చేస్తున్న కశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మర్ రఫి బట్ కూడా ఈ కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా ముగ్గురిని గుర్తించాల్సివుందని పోలీసులు పేర్కొన్నారు. Encounter concluded at Badigam Zainpora Shopian, 5 bodies of terrorists recovered. Well done boys - Army/ CRPF/J&K Police. — Shesh Paul Vaid (@spvaid) May 6, 2018 -
'కుటుంబాలు మీకూ ఉన్నాయ్.. జాగ్రత్త'
శ్రీనగర్: పోలీసుల కుటుంబాలపై టెర్రరిస్టులు దాడులు చేయడంపై జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వేడ్ మిలిటెంట్లకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల ఇళ్లపై దోపిడీలకు దిగి బెదిరింపులకు పాల్పడే వారికి కూడా కుటుంబాలు ఉన్నాయనే సంగతి గుర్తించుకుని ప్రవర్తిస్తే మంచిదని అన్నారు. అనవసరంగా కుటుంబాలను సమస్యల్లోకి లాగొద్దని చెప్పారు. పోలీసుల కుటుంబాలను వేధిస్తే.. అదే తరహాలో తాము కూడా ఉగ్రవాదుల కుటుంబాలను వేధిస్తామని అన్నారు. మంగళవారం ఓ పోలీసు ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు సొత్తు దోచుకుని వెళ్తూ ఉద్యోగం మాన్పించాలని అతని కుటుంబసభ్యులను బెదిరించారు. గత శనివారం షోపియన్‌లో జరిగిన మరో సంఘటనలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటిపై దాడి చేసిన పది మంది మిలిటెంట్లు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించారు. ఘటనలను సీరియస్‌గా తీసుకున్న డీజీపీ వేడ్ టెర్రరిస్టులకు హెచ్చరికలు చేశారు.