అతడిని వ్యతిరేకిస్తే.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్లేనా! | jahnavi behal, who challenged kanhaiah kumar labled as rss agent | Sakshi
Sakshi News home page

అతడిని వ్యతిరేకిస్తే.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్లేనా!

Published Tue, Mar 8 2016 10:17 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

అతడిని వ్యతిరేకిస్తే.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్లేనా! - Sakshi

అతడిని వ్యతిరేకిస్తే.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్లేనా!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వార్ జరుగుతోంది. ఒకవైపు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, మరోవైపు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని 15 ఏళ్ల అమ్మాయి జాహ్నవి బెహల్. విద్యాసంస్థలలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదంటూ కన్హయ్యను సవాలు చేసినందుకు ఇప్పుడు ఆ చిన్నారి మీద అనేక అభాండాలు మోపుతున్నారు, రకరకాల విమర్శలు చేస్తున్నారు. చివరకు ఆమె మీద 'ఆర్ఎస్ఎస్ ఏజెంటు' అని కూడా ముద్ర వేశారు. ఆమె పదోతరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న సమయంలో ఇదంతా చేస్తున్నారు. తనకు ఏ వ్యక్తినీ లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం గానీ, ఒక రాజకీయ సిద్ధాంతాన్ని విమర్శించాలన్న ఉద్దేశం గానీ లేవని జాహ్నవి స్పష్టం చేసింది. కన్హయ్య లేదా మరే ఇతర వ్యక్తుల పట్ల ద్వేషభావం లేదని, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలలో ఎలాంటి జాతివ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదన్నదే తన ఉద్దేశమని తెలిపింది. తనను నవ్వులపాలు చేయాలనుకోవడం, విమర్శించడం కంటే తాను ఏమనుకుంటున్నానో సరిగా అర్థం చేసుకోవాలని కోరింది.

కన్హయ్య విషయంలో జాహ్నవి ఏం చెప్పిందో ఓసారి చూద్దాం.. ''నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిచి చర్చించొచ్చు. కన్హయ్య చేసినది తప్పు. ఆయన మన దేశ ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండకూడదు. దానికి బదులు జాతి వ్యతిరేకుల గురించి మాట్లాడి ఉండాల్సింది'' అని తెలిపింది.

లూథియానాలోని భాయి రణధీర్ సింగ్ నగర్‌లో గల డీఏవీ పబ్లిక్‌స్కూల్లో పదోతరగతి చదువుతున్న జాహ్నవి.. రక్షాజ్యోతి ఫౌండేషన్‌ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటోంది.  స్వామి వివేకానంద జీవితచరిత్ర మీద ఓ పుస్తకం కూడా రాస్తోంది. ప్రజలకు మన నేతలు, గురువుల గురించి సరిగ్గా తెలియదని, అందుకే స్వామి వివేకానంద జీవితం గురించి అందరికీ తెలిసేందుకు తాను పుస్తకం రాస్తున్నానని తెలిపింది. ఆమె తండ్రి అశ్విన్ బెహల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, తల్లి నందినీ బెహల్ గృహిణి. తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ అనుబంధం లేదని అశ్విన్ తెలిపారు. అసలు 15 ఏళ్ల అమ్మాయికి ఏ రాజకీయ పార్టీతోనైనా ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement