
ఆదాయపన్ను పరిమితి పెంచే చాన్స్?
జీతాల మీద బతికే వేతనజీవులు, మధ్యతరగతి ప్రజల మీద పన్నుల భారం మరీ ఎక్కువగా పడకుండా ఉండేందుకు ఆదాయపన్ను పరిమితిని పెంచే యోచనలో ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పన్నుల రూపేణా వాళ్ల దగ్గర నుంచి సొమ్ము లాక్కోవడానికి బదులు వాళ్ల జేబుల్లోనే ఎక్కువ డబ్బు ఉండనిస్తే.. వాళ్లు మరింత ఖర్చుపెట్టే అవకాశం వస్తుందని, తద్వారా పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని జైట్లీ అన్నారు. దీనివల్ల పన్నుల విస్తృతి మరింత పెరగుతుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సమానంగా పరోక్షపన్నులు కడతారని, తాను గానీ, తన అటెండర్ గానీ ఎవరు ఏది కొన్నా ఒకే స్థాయిలో పన్ను కట్టాల్సి ఉంటుందని చెప్పారు. వాడకం ఎక్కువయ్యే కొద్దీ కట్టే పన్ను పెరుగుతుందని చెప్పారు.
ఇలా ప్రతి ఒక్కరూ పరోక్షపన్నులు చెల్లిస్తూనే ఉంటారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే మొత్తం చెల్లించే పన్నుల్లో సగానికి పైగా పరోక్షపన్నులేనని జైట్లీ వివరించారు. ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ డ్యూటీ, సేవాపన్ను.. అన్నీ అందరూ తెలియకుండానే కడతారని తెలిపారు. ఇక ఆదాయపన్ను విషయానికొస్తే.. ఇన్నాళ్లూ పన్ను కట్టకుండా ఎగ్గొట్టేవాళ్లను కూడా పన్ను పరిమితిలోకి తేవడానికే దాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో ఆయన తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. గత బడ్జెట్లో ఆదాయపన్ను పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.