
అబద్ధాలతో నా పరువు తీశారు!
కేజ్రీవాల్‌పై కేసు విషయంలో ఢిల్లీ కోర్టుకు జైట్లీ వాంగ్మూలం
♦ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై వేసిన నేరపూరిత పరువునష్టం దావాకు సంబంధించిన విచారణ నిమిత్తం మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. తప్పుడు అభియోగాలు, అవాస్తవ ప్రకటనలతో తన ప్రతిష్టను దెబ్బదీసేలా కేజ్రీవాల్ తదితరులు వ్యవహరించారని మెజిస్ట్రేట్ సంజయ్ ఖనగ్వాల్‌కు తెలిపారు. ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ) అధ్యక్షుడిగా తానెలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. స్వయంగా ప్రఖ్యాత లాయరైన జైట్లీ.. దాదాపు 70 నిమిషాల పాటు కోర్టులో వివరణ ఇచ్చారు.
కేజ్రీవాల్, ఆప్ నేతలు అశుతోష్, కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ బాజ్‌పేయిలు తనపై ఫేస్‌బుక్, ట్వీటర్, ప్రెస్‌మీట్లలో చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. కోర్టులో దావా వేసిన తరువాత కూడా తనపై, తన కుటుంబంపై ప్రజల్లో ఉన్న గౌరవం తగ్గేలా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సన్నిహితుడైన ఒక సివిల్ సర్వీసెస్ అధికారిపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేజ్రీవాల్ తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై.. ఆ స్టేడియం నిర్మాణ పర్యవేక్షణను ఒక కమిటీ చూసుకుందని, తాను అందులో సభ్యుడిని కూడా కాదని వివరించారు. జైట్లీ తరఫు సాక్షిగా ప్రఖ్యాత జర్నలిస్ట్ రజత్ శర్మ కూడా కోర్టుకు వాంగ్మూలమిచ్చారు. అనంతరం విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. జైట్లీ కోర్టుకు వచ్చిన సమయంలో ఫొటో తీసేందుకు జర్నలిస్టులు ప్రయత్నించడం, వారిని పోలీసులు తోసేయడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది.
ఆరోపణలపై మాటతప్పం: ఆప్
జైట్లీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల విషయంలో వెనక్కుతగ్గమని ఆప్ స్పష్టం చేసింది. జైట్లీ అవినీతికి సంబంధించి తమ వివరణను కోర్టు ముందు ఉంచుతామని తెలిపింది.