నిర్ణయాల్లో అవినీతి, తప్పిదం వేర్వేరు
న్యూఢిల్లీ: నిర్ణయాల్లో తప్పిదాలు, అవినీతిని వేరువేరుగా చూడాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన ఇండస్ట్రీ చాంబర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) సదస్సులో పాల్గొన్న ఆయన కొందరు పారిశ్రామిక వేత్తల అవినీతి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వాధికారుల లంఛం కేసుల దర్యాప్తు విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు పలు నిర్ణయాలు తీసుకోకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిరోధించగలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించాల్సిందిగా లా కమిషన్ కూడా ఇప్పటికే పలు సూచనలు తెలియజేసినట్లు వివరించారు. తీసుకునే నిర్ణయాల్లో లోపాలు, తప్పిదాలు ఉండకుండా ఉండేందుకు ఆ తీసుకునే నిర్ణయంపై ముందుగానే పరి విధాలా చర్చలు జరిపేలా పరిశ్రమలన్నీ కూడా వర్కింగ్ గ్రూపులను ఏర్పాటుచేసుకోవాలని, వాటిని బాధ్యతాయుత సంస్థలుగా మార్చాలని సూచించారు.