డ్రైనేజీలో పడిన మహిళా ఎంపీ
జామ్నగర్: తన నియోజక వర్గంలో ప్రజా సమస్యలు వినడానికి వెళ్లిన ఓ మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె నీల్చున్న డ్రైనేజీ స్లాబ్ ఒక్క సారిగా కుప్పకూలడంతో అమాంతం 10 అడుగుల లోతులో ఉన్న డ్రైనేజీ నీళ్లలో పడిపోయింది.
వివరాల్లోకి వెళ్తే..గుజరాత్లోని జామ్నగర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ ఎంపీగా ఉన్న పూనమ్.. సోమవారం తన నియోజక వర్గంలోని ప్రజల సమస్యలను వినేందుకు వెళ్లారు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో అధికారులు పేదల ఇళ్లు కూల్చేయడంతో.. అక్కడ ఉన్న బాధితులతో ఎంపీ మాట్లాడుతుండగా, ఒక్క సారిగా ఆమె నిల్చున్న డ్రైనేజీ స్లాబ్ కుప్పకూలింది. దీంతో ఎంపీ 10 అడుగుల లోతున్న డ్రైనేజీలో పడిపోయారు. వెంటనే పక్కనున్న అధికారులు, కార్యకర్తలు ఆమెకు సహాయం చేసి బయటకు తీసుకొచ్చారు. గాయాలపాలైన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.