మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే: మోదీ
రహా(అసోం): కాంగ్రెస్ హాయాంలో కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శారదా చిట్ ఫండ్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావించారు. తాము జన ధన్ యోజన పథకం ప్రారంభించడంతో భవిష్యత్ లో చిట్ ఫంఢ్ మోసాలు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరవడంతో ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటున్నారని, చిట్ ఫండ్స్ అవసరం వారికి లేదని పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. 'ఏం చేశామనేది మనం చేసిన పనే చెబుతుంది. కాంగ్రెస్ హాయాంలో జరిగిన పనుల గురించే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం. మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే' అంటూ చురక అందించారు. త్రీడీ ఎజెండాతో అభివృద్ధి సాధిస్తామని మోదీ అన్నారు. అభివృద్ధి(డెవలప్ మెంట్), వేగంగా అభివృద్ధి(స్పీడీ డెవలప్ మెంట్), అన్నివిధాలా అభివృద్ధి(ఆల్ రౌండ్ డెవలప్ మెంట్) ఎజెండాతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.