Assam assembly election 2016
-
'మార్పు కోసమే మాకు ఓటేశారు'
గువాహటి: ఈశాన్య భారతంలో తొలిసారిగా కమలం వికసించింది. అసోంలో బీజేపీ తొలిసారిగా అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అస్సాం ప్రజలు ముగింపు పలికారు. హస్తం పార్టీ ఘోర పరాజయం దిశగా కదులుతోంది. మార్పు కోసమే ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని బీజేపీ నేత రాంమాధవ్ తెలిపారు. అస్సాంలో తమకు 49 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అస్సాంలో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన హిమంత బిశ్వ శర్మ విజయం సాధించారు. అస్సాం బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. -
మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే: మోదీ
రహా(అసోం): కాంగ్రెస్ హాయాంలో కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శారదా చిట్ ఫండ్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావించారు. తాము జన ధన్ యోజన పథకం ప్రారంభించడంతో భవిష్యత్ లో చిట్ ఫంఢ్ మోసాలు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరవడంతో ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటున్నారని, చిట్ ఫండ్స్ అవసరం వారికి లేదని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. 'ఏం చేశామనేది మనం చేసిన పనే చెబుతుంది. కాంగ్రెస్ హాయాంలో జరిగిన పనుల గురించే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం. మన్మోహన్ సింగ్ చెప్పింది నిజమే' అంటూ చురక అందించారు. త్రీడీ ఎజెండాతో అభివృద్ధి సాధిస్తామని మోదీ అన్నారు. అభివృద్ధి(డెవలప్ మెంట్), వేగంగా అభివృద్ధి(స్పీడీ డెవలప్ మెంట్), అన్నివిధాలా అభివృద్ధి(ఆల్ రౌండ్ డెవలప్ మెంట్) ఎజెండాతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. -
'2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం'
కమల్ పూర్: ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ లో విస్తృతంగా ప్రచారం చేసినా బీజేపీ విజయం దక్కలేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. మోదీ 30 ఎన్నికల సభల్లో పాల్గొన్నారని, ప్రజలు ఆయన చెప్పిందతా విని తమ ఓట్లు ద్వారా తీర్పు వెలువరించారని చెప్పారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కమల్ పూర్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఛత్తీస్ గఢ్ సీఎం తనయుడు బ్లాక్ మనీ కలిగివున్నాడని ఆరోపణలు వచ్చినా మోదీ స్పందించలేదని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని దుయ్యబట్టారు. ఈ ధనమంతా ప్రభుత్వ ఖజానాలో ములుగుతోందని తెలిపారు. అసోంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం కట్టబడితే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీయిచ్చారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. సంవత్సరాదాయం రూ.2 లక్షల్లోపు ఉన్నవారికి ఉచిత వైద్యం అందిస్తామని మాటయిచ్చారు. -
'ఆకలితో అలమటిస్తుంటే నినాదాలా?'
గువాహటి: తనకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసినా తిరస్కరించానని బాలీవుడ్ ఐటమ్ గాళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా-అథవాలే(ఆర్పీఐ-ఏ) నాయకురాలు రాఖీ సావంత్ వెల్లడించింది. 2014 సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి లోక్ సభ టిక్కెట్ ఇస్తానంటే తిరస్కరించానని చెప్పింది. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు గువాహటికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడింది. ఈ నెల 11న జరగనున్న అసోంలో ఎన్నికల్లో తమ పార్టీ తరపున 21 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయనున్నారని చెప్పింది. దళిత హక్కుల కోసం పోరాడుతున్నానని.. కాంగ్రెస్, బీజేపీలు పేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించింది. ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే 'భారత్ మాతాకి జై' అని ఎలా నినదిస్తారని సూటిగా ప్రశ్నించింది. అసోంలో నివాసం ఏర్పచుకోవాలనుకుంటున్నానని, ఇక్కడి నుంచే పోరాటం చేయాలనుకుంటున్నట్టు రాఖీ సావంత్ తెలిపింది.