హరియానా ప్రభుత్వానికి జాట్ల డెడ్లైన్!
చండీగఢ్: రిజర్వేషన్ల కోసం మరోసారి ఉద్యమబాట పట్టనున్నట్లు ప్రకటించిన జాట్ నేతలతో శుక్రవారం హరియాణా ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే.. మార్చి 31వ తేదీ వరకు ఆందోళనలకు దూరంగా ఉంటామని జాట్ నేతలు హామీ ఇచ్చారు. దీంతో హరియానా రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
ఇటీవల జాట్ల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆందోళన బాట పట్టనున్నారన్న వార్తలతో.. హరియాణాలో ఇప్పటికే భారీగా పారామిలటరీ బలగాలను మోహరించారు. రోహ్తక్, జజ్జర్, సోనిపట్ జిల్లాలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేసినట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్.. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్తో శాంతిభద్రతలపై సమీక్ష జరిపారు.
ఇవాళ జరిగిన చర్చల్లో తమ ప్రధానమైన ఏడు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకు ఎలాంటి ఆందోళనలు చేపట్టబోమని జాట్ నేతలు తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తమకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు వెల్లడించారు. మార్చి 31 తరువాత తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామన్నారు.