హిమపాతంలో జవాను మృతి
కనిపించని మరొకరి జాడ సియాచిన్‌లో మరో దుర్ఘటన
జమ్మూ/శ్రీనగర్: సియాచిన్‌లో ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకు పాటుపడుతున్న సైనికులపై మరోసారి హిమపాతం విరుచుకుపడింది. ఇటీవల పది మంది జవాన్లు మంచులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన విషాదం మరువక ముందే మరో దుర్ఘటన సంభవించింది. శుక్రవారం సియాచిన్ తుర్టక్ సెక్టార్ లడక్‌లో ఆర్మీ గస్తీ బృందంపై హిమపాతం పడటంతో ఒక జవాను మృతిచెందగా, మరో జవాను గల్లంతయ్యారు. ‘ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమి తుర్టక్‌లో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ బృందంపై ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంచు పడింది. ఇద్దరు జవాన్లు అందులో చిక్కుకుపోయారు.
వెంటనే డ్రిల్లింగ్‌తో మంచు తొలగించి లాన్స్ హవల్దార్ భవన్ తమాంగ్‌ను బయటకు తీశాం. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు’ అని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ మరో జవాను కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశామని, అయినా అతడి జాడ తెలియలేదని చెప్పారు. డార్జిలింగ్‌లోని లోప్షూనకు చెందిన తమాంగ్ మరణం పట్ల ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తన సంతాపాన్ని ప్రకటించారు. గత నెలలో సియాచిన్ గ్లేసియర్‌లో హిమపాతం దెబ్బకు లాన్స్ నాయక్ హనుమంతప్పతో పాటు పది మంది సైనికులు మత్యు ఒడికి చేరిన విషయం తెలిసిందే.