♦ 227 మందితో జాబితా
♦ ఆర్కే నగర్ నుంచే జయ పోటీ
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం ఒంటరిగానే బరిలోకి దిగాలని ఏఐఏడీఎమ్‌కే నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 234 స్థానాలకు గాను 227 సీట్లకు అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సోమవారం ప్రకటించారు. ఆర్‌కే నగర్ నుంచి మళ్లీ పోటీ చేయడానికి జయ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, చిన్న మిత్రపక్షాలకు కేవలం ఏడు సీట్లతో సరిపెట్టారు. వీరు కూడా అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపైనే పోటీచేయనున్నారు. జయ తనకు నమ్మకస్తుడైన ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు మొత్తం 17 మంది మంత్రులకు మళ్లీ సీట్లు కేటాయించగా.. మరో 10 మందికి టికెట్లు తిరస్కరించారు. 149 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం కల్పించారు. ఇద్దరు సిట్టింగ్ మహిళా మంత్రులతో సహా 32 మంది మహిళలకు సీట్లు కేటాయించారు. పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు, కరైకల్, మాహె, యానంలోని ఏడు సీట్లకు, కేరళలోని ఏడు ప్రాంతాలకు అభ్యర్థులను ఏఐఏడీఎమ్‌కే ప్రకటించింది.
కాంగ్రెస్ 41, డీఎంకే 180 స్థానాల్లో పోటీ
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు ముగిసింది. మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే 180, కాంగ్రెస్ 41 స్థానాల్లో పోటీచేసేలా సోమవారం నిర్ణయించారు. మిగిలిన 13 సీట్లను డీఎంకే కూటమిలోని చిన్న పార్టీలకు కేటాయించారు. గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ సోమవారం డీఎంకే చీఫ్ కరుణానిధితో మంతనాలు జరిపాక, కాంగ్రెస్‌కు 41 సీట్లు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. మరోపక్క.. కేరళలో కాంగ్రెస్ 83 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది.