జైలు నుంచి జయ విడుదల
‘అమ్మ’కు ఎదురేగి తమిళనాడు సీఎం, మంత్రుల స్వాగతం
బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరిక
మానవహారంగా ఏర్పడి అభిమానుల ఘన స్వాగతం
బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21 రోజులపాటు జైలుశిక్ష అనుభవించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శనివారం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. జయ బెయిల్ పత్రాలతోపాటు రూ. 2 కోట్లకు ఒక బాండ్‌ను, రూ. కోటికి ఒక పూచీకత్తును ఆమె తరఫు న్యాయవాదులు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి కున్హాకు సమర్పించగా ఆయన విడుదల ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మిగిలిన లాంఛనాలు పూర్తి చేశాక జైలు అధికారులు మధ్యాహ్నం 3.20 గంటలకు జయతోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సమీప బంధువు ఇళవరసి, ఒకప్పటి దత్తపుత్రుడు సుధాకరన్‌లను విడుదల చేశారు. జయ జైలు నుంచి బయటకు రాగానే ఆమెకు స్వాగతం పలికేందుకు తమిళనాడు ప్రభుత్వమే కదిలివచ్చింది.
చెన్నై నుంచి బెంగళూరులోని పరప్పన జైలు ప్రాంగణానికి ఉదయమే చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వంతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ‘అమ్మ’కు సాదర స్వాగతం పలికారు. అలాగే జైలు వెలుపల వేచి ఉన్న వందలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు సైతం జయను చూడగానే నినాదాలు చేశారు. తనకున్న జెడ్ ప్లస్ భద్రతకుతోడు కర్ణాటక ప్రభుత్వం వందలాది మంది పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రత నడుమ జయలలిత పరప్పన అగ్రహార జైలు నుంచి దాదాపు 4 గంటలకు హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. జయ ఎక్కిన వాహనంలో ఆమె సెంటిమెంట్‌గా భావించే కుర్చీని అధికారులు ప్రత్యేకంగా అమర్చారు. శశికళ, ఇళవరసి సైతం జయ వాహనంలో ఎక్కగా సుధాకరన్ మరో వాహనంలో వారిని అనుసరించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారి పొడవునా జయ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ‘అమ్మ’ ఫొటోలు చేతబూని ఆమె కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. వారికి జయలలిత నవ్వుతూ అభివాదం చేశారు.
చెన్నైలో ఘన స్వాగతం..
ప్రత్యేక విమానంలో 4:50 గంటలకు చెన్నై చేరుకున్న జయకు ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జయ, శశికళ ఒకే కారులో భారీ బందోబస్తు నడుమ పోయెస్‌గార్డెన్‌లోని తన ఇంటికి చేరుకోగా ఇళవరసి, సుధాకరన్‌లు మరో కారులో జయ కారును అనుసరించారు. చెన్నైలో భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు లెక్కచేయకుండా విమానాశ్రయం నుంచి పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా బారులు తీరారు. అనేక కూడళ్లలో ‘అమ్మ’ కారుపై పూలవర్షం కురిపించారు. సుమారు 12 కిలోమీటర్ల దూరాన్ని గంటకు పైగా ప్రయాణించి సాయంత్రం 6.10గంటలకు జయ తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరే ముందు జయ దారిలో ఆగి ఓ గుడిలో పూజలు చేశారు. కాగా, జయ బెయిల్‌పై విడుదలవుతారంటూ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలతో పందెం వేసిన ఓ అన్నాడీఎంకే కార్యకర్త తాను చెప్పినది జరగడంతో తన భారీ గుబురు మీసం తీసేశారు.