జయలలితకు మళ్లీ అంత్యక్రియలు!
జయలలితకు మళ్లీ అంత్యక్రియలు!
Published Wed, Dec 14 2016 8:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆమె బంధువులు పవిత్ర నగరం శ్రీరంగపట్నంలో కావేరీ నదీ ఒడ్డున పశ్చిమవాహినిలో మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ ఆచారాల ప్రకారం ఆమెను దహనం చేయకుండా ఖననం చేసినందున ఆమె ఆత్మకు మోక్షం లభించదని, అలా జరగకూడదనే తాము మళ్లీ ఈ అంత్యక్రియలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన పూజారి రంగనాథ్ అయ్యంగార్ జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఒక బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు చేయించారు. రాబోయే ఐదు రోజుల పాటు ఆమె ఆత్మశాంతి కోసం మరికొన్ని కార్యక్రమాలు చేయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
జయలలితకు సోదరుడి వరసయ్యే వరదరాజు ఈ అంత్యక్రియలను దగ్గరుండి చేయించారు. ఆమె నమ్మకాలను పార్టీ సభ్యులు గౌరవించి ఉండాల్సిందని ఆయన భావించారు. తన సోదరి నాస్తికురాలు అయి ఉంటే ఆమె ఆలయాలకు వెళ్లేది కాదని, హిందూ ఉత్సవాల్లో పాల్గొనేది కాదని, అలాగే హిందూ సంప్రదాయాలను పాటించేది కాదని చెప్పారు. అసలు ఆమెను ఖననం చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ ఎలా తీసుకుంటుందని వరదరాజు ప్రశ్నించారు. తామందరినీ అంత్యక్రియల నుంచి ఎందుకు దూరంగా పెట్టారని నిలదీశారు.
జయలలిత డిసెంబర్ ఐదోతేదీ రాత్రి మరణించగా, ఆరోతేదీన ఆమెను ఖననం చేయగానే.. ఆమె అంత్యక్రియలను హిందూ మతాచారాల ప్రకారం చేయలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. జయలలిత హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని, అందువల్ల అయ్యంగార్ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేసి ఉండాల్సిందని కొంతమంది బంధువులు అన్నారు. ఆమెను ఖననం చేసిన తీరుపై మైసూరు, మేలుకోటె నగరాల్లో ఉండే జయ మేనల్లుళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు కూడా తాజాగా నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Advertisement