మిస్టరీగా జయ డ్రైవర్ మృతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకరాజ్
సాక్షి, చెన్నై: కొడనాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డు హత్య కేసులో అనుమానితుడు, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరో నిందితుడు, కనకరాజ్ స్నేహితుడు సయన్ కారు ప్రమాదంలో గాయపడడం అనుమానాలకు తావిస్తోంది. గార్డు హత్యకేసులో వీరిద్దరి పాత్ర ఉందని పోలీసు విచారణలో తేలింది. సేలం జిల్లా ఎడపాడికి చెందిన కనకరాజ్ కోసం గాలింపు సాగుతున్న సమయంలో శుక్రవారం రాత్రి ఆత్తూరు సమీపంలో కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
హత్య కేసులో తన పేరు వినిపిస్తుండడంతో పోలీసుల వద్ద లొంగిపోవడానికి మిత్రుడి బైక్ తీసుకుని కనకరాజ్ వెళ్లినట్టు కుటుంబీకులు చెప్పారు. అయితే, మార్గమధ్యంలో ఓ వాహనం ఢీకొట్టినట్టు, ప్రమాదంలో మరణించినట్టు తేలడం అనుమానాలకు దారితీసింది. సయన్ తిరుచ్చూర్ సమీపంలోని ప్రమాదంలో గాయపడడం అనుమానాలకు బలం చేకూరింది. కనకరాజ్ మరణ సమాచారంతో, ఇక తాను పట్టుబడతానేమోనన్న భయంతో కోయంబత్తూరు నుంచి తిరుచ్చూర్‌కు భార్య వినుప్రియ, కుమార్తె నీలుతో కలిసి కారులో సయన్ వెళ్తున్న సమయంలో ఓ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో భార్య, కుమార్తె మరణించగా, సయన్ తీవ్రగాయాలపాలయ్యారు. సయన్ వద్ద కోయంబత్తూరు జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి సెల్వకుమార్ వాంగ్మూలం తీసుకున్నారు. గార్డు హత్య, ప్రమాదం రూపంలో కనకరాజ్ మరణం, సయన్ ఆస్పత్రి పాలు కావడం వెరసి కొడనాడులో ఏదో రహస్యం దాగి ఉందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని తమిళనాట ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కనకరాజ్‌కు ఎస్టేట్ వివరాలు పూర్తిగా తెలుసునని, జయలలితకు పదేళ్లు డ్రైవర్‌గా పనిచేసిన అతడిని ఆమె మరణించే ఆరు నెలల ముందు తొలగించినట్టు విచారణలో తేలింది. ప్రమాదంలో మరణించిన సయన్ భార్య వినుప్రియ, కుమార్తె నీలుల గొంతులపై కత్తిగాట్లు ఉన్నట్లు కేరళలోని తిరుచ్చూరు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.