- బిహార్ సంక్షోభానికి మీరే కారణం
- గవర్నర్, బీజేపీపై జేడీయూ,
- మిత్రపక్షాల ధ్వజం
పట్నా: బిహార్‌లో జేడీయూ, దాని మిత్రపక్షాలు.. మాంఝీ సర్కారు, గవర్నర్‌పై విరుచుకుపడ్డాయి. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ యత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తాయి. మరికొద్ది రోజుల్లో గద్దె దిగబోయే సీఎం జితన్ రాం మాంఝీ.. రోజుకో ప్రజాకర్షక పథకం ప్రకటిస్తూ రాష్ట్రంపై ఆర్థిక భారం పెంచుతున్నారన్నాయి. గవర్నర్ తీరు, బీజేపీ నీచ రాజకీయాల వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డాయి. ఆదివారమిక్కడ జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘మాంఝీ సర్కారు బలం నిరూపించుకునేందుకు గవర్నర్ ఇంత సమయం ఇవ్వడం దారుణం. సీఎం విశ్వాస పరీక్షలో నెగ్గే వరకూ ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోకుండా సీఎంను గవర్నర్ నిలువరించాలి’’ అని డిమాండ్ చేశారు. జేడీయూ నేత నితీశ్‌పై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ చెప్పినట్లు ఆయన నడుచుకుంటున్నట్లు అర్థమవుతోందన్నారు. మెజారిటీ లేదని తెలుస్తున్నా మాంఝీ సర్కారును రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ రాష్ట్ర చీఫ్ రామ్‌చంద్ర పూర్వే విమర్శించారు. మాంఝీ.. సర్కారు మైనారిటీలో పడ్డ తర్వాత వివిధ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాపై రూ.50 వేల కోట్ల భారం మోపారన్నారు. మహా దళితుడిని అయినందుకే అణగదొక్కాలని చూస్తున్నారంటూ మాంఝీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ కుమార్ చౌదరీ తప్పుపట్టారు.