![Jewels Treasure In Uttar Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/9/11_2.jpg.webp?itok=1j9fywSL)
హార్డోయి పోలీస్ సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి
ఉత్తరప్రదేశ్: అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకు వచ్చిందంటే ఇదేనేమో..! ఉత్తరప్రదేశ్‌లో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న వ్యక్తికి ఏకంగా రూ. 25లక్షల విలువ చేసే ఆభరణాలు దొరికాయి. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు...నిధి దొరికిందని సంబరపడేలోపే విషయం కాస్త పోలీసుల దాకా వెళ్లడంతో సదరు వ్యక్తి నుంచి పోలీసులు ఆ నిధిని స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. కాగా వందేళ్ల క్రితానికి చెందినవిగా భావిస్తున్న 650 గ్రాముల బంగారం, 4.53 కిలోల వెండి ఆభరణాలుగా గుర్తించారు.
హార్డోయి ఎస్పీ అలోక్ ప్రియదర్శి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆ వస్తువులకు పురావస్తు ప్రాముఖ్యత ఉన్నందున వాటిని సదరు వ్యక్తి నుంచి స్వాధీన పరుచుకున్నట్లు చెప్పారు. ఆభరణాలకు సంబంధించి ఎవరి వద్ద ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవని నిర్ధారించారు. పరిసర ప్రాంతాల్లో ఈ విషయం వ్యాపించడంతో చాలా మంది ఆ నిధిని పొందడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆభరణాలను కనుగొన్న వ్యక్తి మొదట ఈ సంఘటనను గూర్చి చెప్పడానికి నిరాకరించినా, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వాటి గురించి తెలియజేశాడు.
ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్-1878, ప్రకారం తవ్వకాలలో బయటపడిన ఏవైనా ఆభరణాలు లేదా ఖరీదైన వస్తువులను చట్టబద్ధంగా ‘నిధి’ అని పిలుస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, ఆ నిధి దొరికిన వ్యక్తి రెవెన్యూ అధికారికి తెలియజేయాలి. విచారణ అనంతరం చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, ఆ నిధి ఎవరికి సంబంధించింది కాదని పోలీసులు నిర్ధారిస్తే ఆ నిధిని కనుగొన్న వ్యక్తి వాటిని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment