బీజేపీ సర్కార్‌కు సొంతమంత్రి ఝలక్
రాయ్‌పూర్: 'ఏదో ఒక రోజు సీబీఐ వస్తుంది. విచారిస్తుంది. అక్రమాలు బయటపడితే జైలులో వేస్తారు. ఇది నాకిష్టం లేదు.. మీ ఇష్టం.. నేను వెళ్లిపోతా' అంటూ జార్ఖండ్ కేబినెట్ మీటింగ్‌కు సొంత పార్టీ మంత్రి ఝలక్ ఇచ్చారు. అందర్నీ విస్తుపోయేలా చేశారు. బీజేపీకి సొంత పార్టీలోని సీనియర్ నేత అయిన సరయురాయ్‌తో తలనొప్పులు మొదలయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఆయన ప్రత్యక్షంగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయానికి మద్దతిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అది తనకు ఇష్టం లేదని చెప్పారు. సరయు రాయ్ పార్లమెంటరీ వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల విభాగానికి ఇన్‌చార్జి మంత్రిగా పనిచేస్తున్నారు.
అయితే, రాష్ట్రంలోని కంపెనీలకు మైనింగ్ హక్కులు పునరుద్ధరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం కాగా ఆయన హాజరై మధ్యలో వెళ్లిపోయారు. కంపెనీలకు మైనింగ్ హక్కులు దారాదత్తం చేస్తే అవి అక్రమాలకు పాల్పడుతున్నాయని విచారణలో తేలిందని, ఈ విషయం కోర్టులో కూడా ఉండటంతోపాటు నిలుపుదల చేసినందున తాను ఈ నిర్ణయానికి మద్దతివ్వలేనని, అలా చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన కుండబద్ధలు కొట్టి వెళ్లిపోయారు. గతంలోనే ఈ అంశాన్ని ఆలోచించినప్పటికీ ఈ నిర్ణయాన్ని సవరించాలని, అలాగే మైనింగ్ శాఖ కచ్చితంగా న్యాయశాఖను కలిసి వివరాలు తెలుసుకోవాలని సరయు రాయ్ ప్రతిపాదించారు. ఇలా చేయకుంటే ఈ మొత్తం వ్యవహారంపై ఏదో ఒకరోజు సీబీఐ విచారణ చేస్తుందని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసి జైలుకు పంపిస్తుందని హెచ్చరించి మరీ వెళ్లారు. ఈ మంత్రికి గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా, బిహార్‌లో చోటు చేసుకున్న దాణా కుంభకోణాన్ని బయటపెట్టిన వ్యక్తిగా మంచి పేరుంది. అధికారంలోని మంత్రి ఇలా కేబినెట్ మీటింగ్ మధ్యలో వెళ్లిపోవడం ప్రతి పక్షాలకు మంచి ఊతం ఇచ్చినట్లు అవుతుందని అధికార బీజేపీ ఆవేదన చెందుతోంది.