
పోలీసుల అదుపులో మాజీ సీఎం కుమారుడు
జెహ్నాబాద్: బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ కుమారుడు ప్రవీణ్ భారీ నగదుతో పట్టుబడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ పోలీసులు జెహ్నాబాద్ ఏయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా అతని నుంచి దాదాపు రూ. 4.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ శాసనసభకు అక్టోబర్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ దగ్గర దొరికిన డబ్బుకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తన ఇంటి నిర్మాణపనుల కోసం కుటుంబసభ్యుల నుంచి ఆ డబ్బు తీసుకెళుతున్నానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం సొంత పూచి కత్తు పై ప్రవీణ్ ను విడుదల చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రం తిరిగి ఇవ్వలేదు.
జితన్ రాం మంఝీ జెహ్నాబాద్ జిల్లాలోని మక్దుంపుర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించారు. జెడీ(యూ) పార్టీ తరఫున శాసన సభకు 6 సార్లు ఎన్నికయ్యారు. మాంజీ ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేసిన అనంతరం జేడీ(యూ) నుంచి బయటకు వచ్చి హిందుస్థానీ అవమ్ మోర్చా పార్టీ(హెచ్ఎమ్)ని స్థాపించారు. ప్రస్తుతం బిహార్కు జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో మంఝీ దగ్గరయ్యారు.