
ఎన్డీఏపై ఉమ్మడి పోరు
నిర్ణయించిన 16 ప్రతిపక్ష పార్టీలు
న్యూఢిల్లీ: అధికార ఎన్డీఏ కూటమిని సమర్థంగా ఎదుర్కొనేలా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో 16 పార్టీలు పాల్గొన్నాయి. తదుపరి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఇతర పార్టీలతో సమన్వయం చేయడానికి ఉపకమిటీ ఏర్పాటుచేసే అధికారాన్ని సోనియాకు అప్పగించారు.
సమావేశం తరువాత కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విలేకర్లతో మాట్లాడుతూ...వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రతిపక్షాలన్నీ మంచి సమన్వయంతో వ్యవహరించాయని తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఉమ్మడి వ్యూహం రచిస్తామని పేర్కొన్నారు. తమ తరఫున రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసిన మీరాకుమార్, గోపాలకృష్ణ గాంధీలకు ప్రతిపక్షాలు కృతజ్ఞతలు తెలిపాయని వెల్లడించారు. సమావేశానికి ఎన్సీపీ గైర్హాజరవగా, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీ, జేఎంఎం, ఆర్‌ఎస్పీ తదితర పార్టీలు హాజరయ్యాయి.