విపక్ష నేతలకు సోనియా విందు | Sonia feast for opposition leaders | Sakshi
Sakshi News home page

విపక్ష నేతలకు సోనియా విందు

Published Wed, Mar 14 2018 2:33 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

Sonia feast for opposition leaders - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్న విపక్ష పార్టీలన్నీ ఒక్క చోటకు చేరాయి. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తన నివాసం 10 జన్‌పథ్‌లో మంగళవారం ఇచ్చిన విందుకు 20 రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. సాధారణ ఎన్నికలకు సుమారు మరో ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించడానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఈ విందు భేటీలో చర్చించారు. ఎన్డీయేతర పక్షాల ఐక్యతను సాధించడమే తొలి ప్రాథమ్యంగా ఈ భేటీ జరిగింది.

ఎన్‌సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, వామపక్షాలు తదితర ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా(జమ్మూకశ్మీర్‌), బాబూలాల్‌ మరండీ, హేమంత్‌ సోరెన్‌(జార్ఖండ్‌), జితన్‌ రాం మాంఝీ(బిహార్‌)లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎన్‌సీపీకి చెందిన శరద్‌ పవార్, ఎస్‌పీ నుంచి రామ్‌ గోపాల్‌ యాదవ్, బీఎస్పీ నేత సతీశ్‌ చంద్ర మిశ్రా, జేడీయూ బహిష్కృత నేత శరద్‌ యాదవ్, ఆర్‌ఎల్‌డీకి చెందిన అజిత్‌ సింగ్‌ తదితరులు విందు సమావేశానికి హాజరయ్యారు.

ఆర్జేడీ తరఫున ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మిసా భారత, కొడుకు తేజస్వీ యాదవ్‌లు వచ్చారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి సుదీప్‌ బందోపాధ్యాయ, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నుంచి మహమ్మద్‌ సలీం, డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి, ఏఐయూడీఎఫ్‌కు చెందిన బద్రుద్దీన్‌ అజ్మల్, జేడీఎస్‌ నేత కుపేందర్‌ రెడ్డి తదితరులు కూడా సోనియా పిలుపు మేరకు ఈ సమావేశానికి వచ్చారు. టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేడీలకు ఆహ్వానం పంపించలేదని సమాచారం.

సోనియాతోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, ఇతర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్, ఏకే ఆంటోని తదితరులు విందులో పాల్గొన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ తమ విభేదాలను పక్కనబెట్టి కలసి రావాలని గతంలోనూ సోనియా కోరడం తెలిసిందే. తృణమూల్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ విందే. కానీ రాజకీయాల గురించి మేం మాట్లాడలేదు. మా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎందుకు రాలేదని సోనియా నన్ను ఆరా తీశారు. ఆమె ముందుగా అనుకున్న కొన్ని పనులు ఉండటం వల్ల రాలేకపోయారని చెప్పాను’ అని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement