
కావాలనే కేంద్రం పక్షపాతం: సోనియా
రాయ్ బరేలీ: తన నియోజవర్గం రాయ్ బరేలీ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తమ నియోజకవర్గంపై కావాలనే పక్షపాతం చూపిస్తోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలే ఆమె తనయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విషయం తెలిసిందే. ఒక రోజు పర్యటనలో భాగంగా రాయ్ బరేలీ వచ్చిన ఆమె నేరుగా కేంద్రంపై ఎలాంటి విమర్శ చేయలేదు. అయితే, ఈ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి మనోజ్ కుమార్ పాండే మాత్రం ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానాన్ని స్వయంగా సోనియాగాంధీ చదవి వినిపించారు.
గతంలో రోడ్డు నిర్మాణాలకోసం ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ద్వారా గుర్తించిన పనులకు తక్కువ బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఉదాసీనంగా వ్యవహరిస్తోందని అందులో ఆరోపించారు. అకాల వర్షం కారణంగా పంట నష్టం చవి చూసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.197 కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.22 కోట్లే కేటాయించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు ఆమె తలా రెండు లక్షల రూపాయల చెక్లను అందజేశారు.