సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పాలకపక్షానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ శుక్రవారం రాష్ట్రపతికి సిఫార్సు చేయడం వల్ల ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమైనా ఉందా? ఎన్నికల కమిషన్ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించే అవకాశం పూర్తిగా ఉన్నందున ఆ 20 మంది శాసనసభ్యులు శాసన సభలో తమ సభ్యత్వాన్ని కోల్పోవడం దాదాపు ఖాయం.
అదే జరిగితే 70 సీట్లు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ బలం ప్రస్తుతమున్న 67 నుంచి 47 సభ్యులకు పడిపోతుంది. ప్రభుత్వం మనుగడకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36 కనుక, కేజ్రివాల్ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ప్రస్తుతానికి ఏమీ లేదు. మరో పదిమంది ఆప్ ఎమ్మెల్యేలు పలు అవినీతి, ఇతర కేసులను ఎదుర్కొంటున్నందున వారి శాసన సభ్యత్వం కూడా రద్దవుతుందని, పర్వవసానంగా కేజ్రివాల్ ప్రభుత్వం పడిపోతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకప్పుడు ఆశించింది. అయితే కేసులను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సభ్యత్వం ఇంతవరకు రద్దు కాలేదు. సమీప భవిష్యత్తులో అయ్యే అవకాశమూ లేదు. ఒకవేళ అవుతుందనుకున్నట్లయితే పార్టీ బలం 37కు పడిపోతుంది. అప్పటికీ ఆప్‌కు మెజారిటీ ఉంటుంది.
ఈలోగా, 20 మంది శాసన సభ్యుల సభ్యత్వం రద్దయితే ఆ స్థానాలకు మళ్లీ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో ఆప్ మొత్తం కాకపోయినా కనీసం సగం సీట్లనైనా గెలుచుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రివాల్ పరువు పోయిందని చెప్పవచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో 70 సీట్లు మాత్రమే ఉండడం వల్ల అందులో పది శాతానికి మించి, అంటే ఏడుగురికి మించి మంత్రి పదవులు ఇవ్వరాదు. ముందుగా ఏడుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. పదవుల కోసం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలవడంతో 21 మంది శాసన సభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా మే నెలలో నియమించారు. వారికి జీత భత్యాలు పెంచక పోయినా ప్రభుత్వ భవనాలు, వాహనాలు కేటాయించారు. 1997లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఒకరు ఆర్థిక ప్రయోజనాలు కలిగిన ‘జోడు పదవుల్లో’ కొనసాగరాదు.
ఈ కారణంగానే అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆప్ పార్టీపై ధ్వజమెత్తాయి. జీత భత్యాలు పెంచనందున పార్లమెంటరీ కార్యదర్శులుగా ఎమ్మెల్యేలను నియమించడం జోడు పదవుల కిందకు రాదని అరవింద్ కేజ్రివాల్ వాదించారు. ప్రభుత్వ బంగళాలు, వాహనాల సౌకర్యాలను కల్పించడం కూడా ఆర్థిక లబ్ధి కిందకే వస్తాయని ప్రతిపక్షాలు వాదించాయి. దాంతో ఎందుకైనా మంచిదని కేజ్రివాల్ ‘డిల్లీ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్) చట్టం–1997 నుంచి ఈ కార్యదర్శి పదవులకు మనహాయింపు కలిగిస్తూ 2015, జూన్ నెలలో ఓ సవరణ బిల్లును తీసుకొచ్చారు. దాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపించగా, రాష్ట్రపతి ఆ బిల్లును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో 21 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రశాంత్ పటేల్ అనే న్యాయవాది రాష్ట్రపతి ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ఆధారంగానే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. వారిలో జర్నేల్ సింగ్ అనే ఎమ్మెల్యే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రం నుంచి పోటీ చేసేందుకు తన ఢిల్లీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 20 మంది ఎమ్మెల్యేలపైనే ఎన్నికల కమిషన్ ముందు విచారణ జరిగింది. ప్రభుత్వం అదనంగా కల్పించిన సౌకర్యాలను వదులుకున్నామని, తమపై అనర్హత వేటు వేయవద్దని 20 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్ ముందు వాదించారు. అక్కడ లాభం లేదనుకున్న వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా వారికి ఆశాభంగమే కలిగింది.
కేజ్రివాల్ పరువుతీసిన వ్యవహారం
Published Fri, Jan 19 2018 4:23 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment