చెన్నై: పోలీసులు విచక్షణారహితంగా కొట్టినందు వల్లే సత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, బెనిక్స్ మరణించినట్లు జ్యుడిషియల్ విచారణలో తేలింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై మద్రాస్ హైకోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘటనపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ మంగళవారం ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, పోలీస్ స్టేషనులోని పరిస్థితులను బట్టి పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే జయరాజ్, బెనిక్స్ మృతి చెందారని పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన నివేదికలో.. ‘‘జూన్ 19 రాత్రంతా పోలీసు అధికారులు ఆ తండ్రీకొడుకులను కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బాధితులను కొట్టేందుకు ఉపయోగించిన లాఠీలు, వారిని పడుకోబెట్టిన బల్లపై రక్తపు మరకలు ఉన్నాయి.
ఆ లాఠీలను హ్యాండోవర్ చేయాల్సిందిగా నేను ఆదేశించగా.. సత్తాన్‌కులం పోలీసులు నా మాటలు వినబడనట్లు నటించారు. నేను గట్టిగా అడిగిన తర్వాత అయిష్టంగానే వాటిని ఇచ్చారు. మహరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ నా వెనుక చేరి గొణగడం మొదలు పెట్టారు. విచారణతో నేనేమీ సాధించలేది లేదని అన్నారు. ఇక మరో పోలీసు అధికారి బాధితులను వేధిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు తెలిసింది. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్టింగులు మార్చారు. ఇవే కాకుండా ఈ కేసులో ఉన్న ఇతర సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటిని పరిరక్షించే ఏర్పాట్లు చేయాలి’’అంటూ విచారణలో వెల్లడైన అంశాలను పొందుపరిచారు. (కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు)
కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు షాపును తెరచి ఉంచాడని పోలీసులు జూన్ 19న జయరాజ్(59) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి అరెస్టును నిరసిస్తూ సత్తాన్‌కులం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అతడి కొడుకు బెనిక్స్(31)ను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిపై ఐపీసీ 188, 383,506(II)తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. మెజిస్ట్రేట్ ఆదేశాలతో కోవిల్ పట్టి సబ్ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో జూన్ 23న తండ్రీకొడుకులు ఇద్దరు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా జయరాజ్, బెనిక్స్‌లను తీవ్రంగా కొట్టడం వల్లే వారు మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఇక అమానుష ఘటనపై మండిపడ్డ మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇక మంగళవారం ఈ ఘటనపై మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించిన నేపథ్యంలో ఈ విషయంపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!)
Comments
Please login to add a commentAdd a comment