judicial enquiry
-
హత్రాస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బోలే బాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసుల వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.హత్రాస్ జిల్లాలో తొక్కిసలాటలో 121 మంది మరణించిన ఘటనపై న్యాయ విచారణ జరిపించనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ జ్యుడీషియల్ విచారణ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, పోలీసు అధికారులు ఉంటారని తెలిపారు.ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు. కాగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలేదిలేదని సీఎం ఇప్పటికే ప్రకటించారుసుప్రీంకోర్టులో పిటిషన్మరోవైపు, హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. -
సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ
-
మళ్లీ రాజుకున్న రఫేల్ గొడవ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ సంస్థ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్‌లో తాజాగా న్యాయ విచారణ మొదలైనట్లు ఫ్రెంచ్ పరిశోధక వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. విచారణకు నేతృత్వం వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. దాదాపు రూ.59 వేల కోట్ల విలువైన ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసిన 36 రఫేల్ ఫైటర్ జెట్లను ఇండియాకు విక్రయించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని ఫైటర్ జెట్లను దసాల్ట్ సంస్థ తయారుచేసి భారత్‌కు పంపించింది. ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఇరుదేశాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద రఫేల్ డీల్‌పై ఫ్రాన్స్‌లో ‘నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్(పీఎన్ఎఫ్)’ ఆదేశాల మేరకు గత నెల 14న న్యాయ విచారణ అధికారికంగా ప్రారంభమైనట్లు మీడియాపార్ట్ పేర్కొంది. అత్యంత భారీ ఆర్థిక, వాణిజ్య నేరాల విచారణ కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం.. పీఎన్‌ఎఫ్‌ను 2013 ఏడాదిలో ఏర్పాటుచేసింది. భారత మధ్యవర్తికి రూ.8.84 కోట్లు రఫేల్ ఒప్పందంలో అవినీతి, అవకతవకలపై ‘షెర్పా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఫిర్యాదు చేసిందని, ఆర్థిక నేరాల గుట్టును రట్టు చేయడంలో ఈ సంస్థ దిట్ట అని మీడియాపార్ట్ గతంలో పేర్కొంది. డీల్ కుదిర్చినందుకు దసాల్ట్ .. భారత్‌లోని ఓ మధ్యవర్తికి 10 లక్షల యూరోలు(దాదాపు రూ.8.84 కోట్లు) కమీషన్ కింద చెల్లించినట్లు వెబ్సైట్ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను దసాల్ట్ కంపెనీ కొట్టిపారేసింది. రఫేల్ ఒప్పందంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పింది. రఫేల్ డీల్ లో కమీషన్ల బాగోతంపై వచ్చిన మొదటి ఫిర్యాదును 2019లో అప్పటి పీఎన్ఎఫ్ చీఫ్ ఎలియానీ హూలెట్ తొక్కిపెట్టారని మీడియాపార్ట్ వెబ్సైట్ పాత్రికేయుడు యాన్ ఫిలిప్పిన్ ఆరోపించారు. ప్రత్యర్థి కంపెనీల ఏజెంట్ రాహుల్: బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రత్యర్థి రక్షణ కంపెనీల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆయా కంపెనీ చేతుల్లో పావుగా మారారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్‌తోపాటు రాహుల్ గాంధీ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిపోయిందన్నారు. రఫేల్ డీల్‌లో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు ముట్టలేదని, ఆ అక్కసుతో ఎన్డీయే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ‘కాగ్’, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయని సంబిత్ గుర్తుచేశారు. ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించలేదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని అన్నారు. జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన ఫైటర్ల జెట్ల కొనుగోలులో గోల్మాల్ను నిగ్గుతేల్చడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలని సూర్జేవాలా డిమాండ్‌చేశారు. ‘ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం అంగీకరించింది. న్యాయ విచారణ ప్రారంభించింది. అలాంటప్పుడు ఈ అవినీతికి మూలకేంద్రమైన భారత్‌లో జేపీసీ దర్యాప్తు ఎందుకు జరపకూడదు?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ అంశం కాదని, దేశ భద్రత, అవినీతికి సంబంధించిన అంశమన్నారు. రఫేల్ డీల్ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని తెలిపారు. -
రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు
చెన్నై: పోలీసులు విచక్షణారహితంగా కొట్టినందు వల్లే సత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, బెనిక్స్ మరణించినట్లు జ్యుడిషియల్ విచారణలో తేలింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై మద్రాస్ హైకోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘటనపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ మంగళవారం ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, పోలీస్ స్టేషనులోని పరిస్థితులను బట్టి పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే జయరాజ్, బెనిక్స్ మృతి చెందారని పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన నివేదికలో.. ‘‘జూన్ 19 రాత్రంతా పోలీసు అధికారులు ఆ తండ్రీకొడుకులను కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బాధితులను కొట్టేందుకు ఉపయోగించిన లాఠీలు, వారిని పడుకోబెట్టిన బల్లపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ లాఠీలను హ్యాండోవర్ చేయాల్సిందిగా నేను ఆదేశించగా.. సత్తాన్‌కులం పోలీసులు నా మాటలు వినబడనట్లు నటించారు. నేను గట్టిగా అడిగిన తర్వాత అయిష్టంగానే వాటిని ఇచ్చారు. మహరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ నా వెనుక చేరి గొణగడం మొదలు పెట్టారు. విచారణతో నేనేమీ సాధించలేది లేదని అన్నారు. ఇక మరో పోలీసు అధికారి బాధితులను వేధిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు తెలిసింది. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్టింగులు మార్చారు. ఇవే కాకుండా ఈ కేసులో ఉన్న ఇతర సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటిని పరిరక్షించే ఏర్పాట్లు చేయాలి’’అంటూ విచారణలో వెల్లడైన అంశాలను పొందుపరిచారు. (కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు) కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు షాపును తెరచి ఉంచాడని పోలీసులు జూన్ 19న జయరాజ్(59) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి అరెస్టును నిరసిస్తూ సత్తాన్‌కులం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అతడి కొడుకు బెనిక్స్(31)ను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిపై ఐపీసీ 188, 383,506(II)తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. మెజిస్ట్రేట్ ఆదేశాలతో కోవిల్ పట్టి సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జూన్ 23న తండ్రీకొడుకులు ఇద్దరు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టడం వల్లే వారు మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఇక అమానుష ఘటనపై మండిపడ్డ మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇక మంగళవారం ఈ ఘటనపై మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించిన నేపథ్యంలో ఈ విషయంపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) -
‘మీటూ’ కేసులపై కమిటీ!
న్యూఢిల్లీ: ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా వెలుగుచూస్తున్న లైంగిక దాడుల ఆరోపణలపై విచారణకు న్యాయ నిపుణులతో కమిటీ నియమించాలని యోచిస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. బాధితురాళ్ల వేదన, క్షోభను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. మరింత మంది మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాల్ని వివరించాలని సూచించారు. శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పారు. లైంగిక వేధింపుల కేసులు చాన్నాళ్లుగా ఉన్నా, మనం పట్టించుకోవడంలేదని, ఇప్పుడు బాధితురాళ్లు వాటిని ఎలా నిరూపిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మేనక స్పందించలేదు. మంత్రి అక్బర్‌తో పాటు ప్రముఖ సినీ దర్శకుడు సాజిద్ ఖాన్, నటుడు అలోక్‌నాథ్ తదితరులపై లైంగిక అనుచిత ప్రవర్తన ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరూపణ ప్రశ్నార్థకం.. ‘బాధితురాళ్లు చెప్పినదాన్ని నమ్ముతున్నా. వారి బాధ, క్షోభను అర్థంచేసుకోగలను. మీటూ ఉద్యమంలో భాగంగా వెలుగుచూస్తున్న ఇలాంటి కేసుల విచారణకు న్యాయ నిపుణులతో కూడిన కమిటీని నియమించాలని యోచిస్తున్నాం. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న న్యాయ, చట్టబద్ధమైన ఏర్పాట్లను పరిశీలించి, వాటిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖకు ఈ కమిటీ సలహాలు, సూచనలు చేస్తుంది. తమకు ఎదురైన ఇలాంటి చెడు అనుభవాల్ని బయటికి చెప్పడానికి మహిళలకు చాలా ధైర్యం కావాలి. లైంగిక వేధింపుల గురించి పాతికేళ్లుగా వింటున్నాం. కానీ వాటి గురించి చర్చించడానికి, మాట్లాడటానికి వెనకాడుతున్నాం. ఇన్నేళ్ల తరువాత బాధితులు వాటిని ఎలా నిరూపిస్తారన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కారకుల పేర్లను నిర్భయంగా బయటపెట్టడం వల్ల బాధితురాళ్లకు కాస్త సాంత్వన కలుగుతుంది’ అని మేనకా గాంధీ అన్నారు. మహిళలు నేరుగా తనకు ఫిర్యాదుచేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదుల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. షీబాక్స్, మహిళా, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయొచ్చని తెలిపారు. నిజాన్ని బిగ్గరగా చెప్పాల్సిందే: రాహుల్ ‘మీటూ’ ఉద్యమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతుపలికారు. మార్పు తీసుకురావాలంటే నిజాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కేంద్ర మంత్రి అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘మహిళలను గౌరవంగా, హుందాగా ఎలా చూడాలో అందరూ నేర్చుకోవాల్సిన సమయం ఇది. మార్పు తీసుకురావాలంటే నిజాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెప్పాలి’ అని ‘మీటూ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. -
ఏర్పేడు ప్రమాదంపై న్యాయ విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఏర్పేడు మండలం మునగాలపాలెం వద్ద జరిగిన లారీ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు డా.కె.నారాయణ టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో పెరిగిపోతున్న ఇసుక, మైనింగ్ ఆగడాలకు, ఏర్పేడు ఘటనకు సీఎం చంద్రబాబే కారణమని, అందువల్ల దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఈ సంఘటనకు చంద్రబాబు, రూరల్ ఎస్పీ జయలక్ష్మీ నైతిక బాధ్యత వహించాలన్నారు. రూరల్ ఎస్పీ జయలక్ష్మీపై హత్యానేరం కేసును నమోదు చేయాలన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసహాయాన్ని ప్రటకించాలని, ఈ కుటుంబాలకు విద్యా,వైద్య,ఉపాధి పరంగా ఆదుకోవాలని కోరారు. బుధవారం మగ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి , అజీజ్‌పాషాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇసుక,మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని, ఎటు చూసినా అధికారపార్టీ పచ్చచొక్కాలు మాఫియాగా మారి రైతులు, ప్రజలపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే స్వర్ణముఖి నది నుంచి ఉచితంగా తీస్తున్న ఇసుకను సమీపంలోని అటవీప్రాంతం, గ్రామాలలో నిల్వ చేసి కర్ణాటక, తమిళనాడులలో విక్రయిస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న రైతులు, కూలీలపై ఎస్సీ,ఎస్టీలతో కేసులు పెట్టిస్తున్నారని ఆయన చెప్పారు. తమ గ్రామంలో ఇసుక నిల్వ చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని నారాయణ తెలిపారు.ఒక పక్క భూగర్భజలాలను పెంచేందుకు చెక్‌డ్యాంలను ప్రభుత్వం నిర్మిస్తూనే మరోవైపు ఇసుకమాఫియా ద్వారా అక్రమంగా ఇసుకను విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఇసుక, మైనింగ్ మాఫియా ఆగడాలను వ్యతిరేకిస్తే వందల సంఖ్యలో రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వారు లోనికి వెళ్లకుండా రోడ్డుపై నిలబెట్టగా లారీ భీబత్సంతో అమాయక రైతులు, మహిళలు, పిల్లలు మృత్యువాత పడ్డారన్నారు. చత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్ట్‌లు కాల్పిచంపడాన్ని నారాయణ ఖండించారు. తుపాకీ గొట్టం ద్వారా విప్లవం రాదన్న విషయాన్ని ఇప్పటికైనా మావోయిస్ట్‌లు గ్రహించి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. ప్రభుత్వం కూడా తుపాకీ ద్వారా రాజ్యహింసను ప్రోత్సహించడం సరైనది కాదన్నారు. ఉద్యమాలను అణచేస్తే అగ్నిగొళంగా బద్ధలవుతాయి సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల వల్ల ధర్నాచౌక్ పరిరక్షణకై జరుగుతున్న విశాల ఉద్యమం నాలుగు గోడల మధ్య జరపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సీపీఐనేత నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూస్తుంటే సీఎం కేసీఆర్ నిజాం నవాబుగా మారిపోయాడని అనిపిస్తోందని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ప్రజాతంత్ర ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచేస్తే అవి ఒక్కసారిగా అగ్నిగోళం మాదిరిగా బద్ధలై విరుచుకుపడతాయని హెచ్చరించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నారు.ఓయూ శతాబ్దికి కేటాయించిన నిధులు చావుకు ఖర్చు చేసినట్లుగా ఉందని, ఈ వర్శిటీని బతికించి అభివృద్ధి చేసేందుకు కాదన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. -
సభలో సమరం
-
ఆ ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి
► తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ రౌండ్‌టేబుల్‌లో వక్తల డిమాండ్ ► కోవర్టు వ్యవస్థకు చంద్రబాబే ఆద్యుడు ► మైండ్‌గేమ్ మాది కాదు.. ఆంధ్రా డీజీపీదే: వరవరరావు ► ఎన్కౌంటర్లతో రాజకీయ విశ్వాసాలను అంతం చేయలేరు: కోదండరాం ► పోలీసులకు చంపే హక్కు ఎవరిచ్చారు?: జస్టిస్ చంద్రకుమార్ సాక్షి, హైదరాబాద్: మల్కన్‌గిరిలో మావోయిస్టులు, మధ్యప్రదేశ్‌లో సిమి, తెలంగాణలో వికారుద్దీన్ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. గత నెల 24న ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్కౌంటర్ పేరుతో 22 మంది మావోయిస్టులను, తొమ్మిది మంది ఆదివాసీలను పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపిందని ఆరోపించింది. ఈ చర్యను సమావేశంలో పాల్గొన్న వక్తలు తీవ్రంగా ఖండించారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. కోవర్టు వ్యవస్థకు అంకురార్పణ చేసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన నయీం.. మావోయిస్టుగా చెప్పుకున్న కోవర్టని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మావోయిస్టులను కాల్చిచంపించి, మావోయిస్టులే మైండ్‌గేమ్ ఆడుతున్నారని చెపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి పంచాది కృష్ణమూర్తిని కాల్చిచంపింది మొదలుకుని నిన్నటి మల్కన్‌గిరి ఎన్కౌంటర్ వరకు గత 40 ఏళ్లుగా మైండ్‌గేమ్ ఆడుతోంది పోలీసులే తప్ప నక్సలైట్లు కాదని స్పష్టం చేశారు. నిజంగా ఎన్కౌంటర్లో చనిపోయిందెవరో స్పష్టంగా తెలి సినా.. వారి పేర్లను కాకుండా అసలు చనిపోని వాళ్ల పేర్లను ప్రకటించి మైండ్ గేమ్ ఆడింది ఏపీ డీజీపీనే అని వరవరరావు ఆరోపించారు. హింసతో మరిన్ని సమస్యలు: కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఎన్కౌంటర్లతో రాజకీయ విశ్వాసాలను అంతం చేస్తామనుకోవడం ప్రభుత్వ అవివేకమన్నారు. ప్రభుత్వమే పౌరులపై హింసకు పాల్పడడం ప్రజాస్వామిక విలువల పతనమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హింస మరిన్ని సమస్యలకు బీజం వేస్తుంది తప్ప పరిష్కారం ముమ్మాటికీ కాదన్నారు. మానవీయ సమాజ నిర్మాణంలో హక్కుల సాధన దిశగా అందరం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పౌరులను చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ రమా మేల్కొటే మాట్లాడుతూ మధ్యయుగాల నాటి యూరప్ పరిస్థితులే నేడు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవించే హక్కును హరించి వేస్తున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ప్రొఫెసర్ పద్మజాషా మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ పేరుతో ఈ దేశ పౌరులపైనే క్రూరంగా హింసకు పాల్పడడం తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకుని లబ్ధిపొందుతున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు పోటీలుపడి మరీ ఇటు వికారుద్దీన్‌ని, అటు ఎర్రచందనం పేరుతో సామాన్యులను మట్టుబెట్టారని ఆరోపించారు. తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకుడు చిక్కుడు ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బల్లా రవీంద్రనాథ్, ఎన్కౌంటర్లో మరణించిన ప్రభాకర్ భార్య దేవేంద్ర, జైని మల్లయ్య గుప్తా, ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, కోటా శ్రీనివాస్, బండి దుర్గాప్రసాద్, నలమాస కృష్ణ, గురజాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
'కాల్‌మనీపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి'
రాజమండ్రి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపించాలని శుక్రవారం సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కాల్‌మనీ వ్యవహారంలో బాధితులైన మహిళలకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ వ్యవహారంలో దోషులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంపై అఖిలపక్షంతో చర్చించాలని రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. -
గోదావరి పుష్కర దుర్ఘటనపై న్యాయవిచారణకు కమిటీ
గోదావరి పుష్కరాల తొలిరోజునే తొక్కిసలాట జరిగి, 25 మంది మరణించిన దుర్ఘటనపై న్యాయ విచారణకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. విచారణకు ఆరు నెలల గడువు విధించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. పుష్కరాల మొదటి రోజున సీఎం చంద్రబాబు పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం చేయడం, ఆరోజు చాలామంది భక్తులు వేచి చూడాల్సి వచ్చి.. చివరకు అందరినీ ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 25 మంది మరణించడం లాంటి ఘటనలు జరిగాయి. ఇంకా ఎంతోమంది ఆరోజు గాయపడ్డారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆదేశించింది. -
రిషితేశ్వరి ఆత్మహత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి
విశాఖపట్నం : విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... రిషితేశ్వరి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ కేటాయింపులపై జోక్యం చేసుకుని ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
'చైతన్య విద్యార్థి మృతిపై న్యాయ విచారణ జరపాలి'
తిరుపతి: చైతన్య స్కూల్ విద్యార్థి మోహన్ కృష్ణ మృతిపై న్యాయ విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని స్థానిక కరణాల వీధిలోని చైతన్య స్కూల్ వద్ద గురువారం మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. రాష్ట్ర మంత్రి పి. నారాయణ ద్వంద్వ నీతిని పాటిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.