లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బోలే బాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసుల వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
హత్రాస్ జిల్లాలో తొక్కిసలాటలో 121 మంది మరణించిన ఘటనపై న్యాయ విచారణ జరిపించనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ జ్యుడీషియల్ విచారణ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, పోలీసు అధికారులు ఉంటారని తెలిపారు.
ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు. కాగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలేదిలేదని సీఎం ఇప్పటికే ప్రకటించారు
సుప్రీంకోర్టులో పిటిషన్
మరోవైపు, హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.
Comments
Please login to add a commentAdd a comment