
ఆ ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలి
మల్కన్‌గిరిలో మావోయిస్టులు, మధ్యప్రదేశ్‌లో సిమి, తెలంగాణలో వికారుద్దీన్ ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.
► తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ రౌండ్‌టేబుల్‌లో వక్తల డిమాండ్
► కోవర్టు వ్యవస్థకు చంద్రబాబే ఆద్యుడు
► మైండ్‌గేమ్ మాది కాదు.. ఆంధ్రా డీజీపీదే: వరవరరావు
► ఎన్‌కౌంటర్లతో రాజకీయ విశ్వాసాలను అంతం చేయలేరు: కోదండరాం
► పోలీసులకు చంపే హక్కు ఎవరిచ్చారు?: జస్టిస్ చంద్రకుమార్
సాక్షి, హైదరాబాద్: మల్కన్‌గిరిలో మావోయిస్టులు, మధ్యప్రదేశ్‌లో సిమి, తెలంగాణలో వికారుద్దీన్ ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. గత నెల 24న ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ పేరుతో 22 మంది మావోయిస్టులను, తొమ్మిది మంది ఆదివాసీలను పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపిందని ఆరోపించింది. ఈ చర్యను సమావేశంలో పాల్గొన్న వక్తలు తీవ్రంగా ఖండించారు.
శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. కోవర్టు వ్యవస్థకు అంకురార్పణ చేసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన నయీం.. మావోయిస్టుగా చెప్పుకున్న కోవర్టని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు మావోయిస్టులను కాల్చిచంపించి, మావోయిస్టులే మైండ్‌గేమ్ ఆడుతున్నారని చెపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి పంచాది కృష్ణమూర్తిని కాల్చిచంపింది మొదలుకుని నిన్నటి మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ వరకు గత 40 ఏళ్లుగా మైండ్‌గేమ్ ఆడుతోంది పోలీసులే తప్ప నక్సలైట్లు కాదని స్పష్టం చేశారు. నిజంగా ఎన్‌కౌంటర్లో చనిపోయిందెవరో స్పష్టంగా తెలి సినా.. వారి పేర్లను కాకుండా అసలు చనిపోని వాళ్ల పేర్లను ప్రకటించి మైండ్ గేమ్ ఆడింది ఏపీ డీజీపీనే అని వరవరరావు ఆరోపించారు.
హింసతో మరిన్ని సమస్యలు: కోదండరాం
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఎన్‌కౌంటర్లతో రాజకీయ విశ్వాసాలను అంతం చేస్తామనుకోవడం ప్రభుత్వ అవివేకమన్నారు. ప్రభుత్వమే పౌరులపై హింసకు పాల్పడడం ప్రజాస్వామిక విలువల పతనమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హింస మరిన్ని సమస్యలకు బీజం వేస్తుంది తప్ప పరిష్కారం ముమ్మాటికీ కాదన్నారు. మానవీయ సమాజ నిర్మాణంలో హక్కుల సాధన దిశగా అందరం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పౌరులను చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ రమా మేల్కొటే మాట్లాడుతూ మధ్యయుగాల నాటి యూరప్ పరిస్థితులే నేడు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవించే హక్కును హరించి వేస్తున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు.
ప్రొఫెసర్ పద్మజాషా మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్ పేరుతో ఈ దేశ పౌరులపైనే క్రూరంగా హింసకు పాల్పడడం తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకుని లబ్ధిపొందుతున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు పోటీలుపడి మరీ ఇటు వికారుద్దీన్‌ని, అటు ఎర్రచందనం పేరుతో సామాన్యులను మట్టుబెట్టారని ఆరోపించారు. తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకుడు చిక్కుడు ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బల్లా రవీంద్రనాథ్, ఎన్‌కౌంటర్‌లో మరణించిన ప్రభాకర్ భార్య దేవేంద్ర, జైని మల్లయ్య గుప్తా, ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్‌రావు, కోటా శ్రీనివాస్, బండి దుర్గాప్రసాద్, నలమాస కృష్ణ, గురజాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.