న్యూఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి తీసుకు వచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కోహినూర్‌ను తిరిగి దేశానికి తెప్పించాల్సిన బాధ్యత తమది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని తాము ఆ దేశాన్ని ఆదేశించలేమని తెలిపింది.
కాగా కోహినూర్ తోపాటు టిప్పుసుల్తాన్ ఉంగరం, కత్తి వంటి అమూల్యమైన వారసత్వ సంపదను తిరిగి భారత్‌కు రప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆలిండియా హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ ఫ్రంట్ సంస్థలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశాయి. దీనిని విచారణకు చేపట్టిన న్యాయస్థానం గతంలో కేంద్రం సమాధానం కోరిన సంగతి తెలిసిందే.
దీనిపై కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాల్సిందిగా యునైటెడ్ కింగ్‌డమ్‌ను బలవంతపెట్టలేమని, ఆ వజ్రాన్ని బ్రిటన్ దొంగలించడం కానీ, బలవంతంగా తీసుకుపోవడంగానీ చేయలేదని, ఆ దేశానికి కానుకగా ఇచ్చామని న్యాయస్థానానికి విన్నవించింది. అయితే కోహినూర్ వజ్రాన్ని తీసుకు వచ్చేలా ఆదేశించాలంటూ మరోసారి దాఖలైన ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ బెంచ్ ఇవాళ తిరస్కరించింది.