జూడాల సమ్మె
సాక్షి, చెన్నై: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఒక రోజు సమ్మెకు దిగారు. దీంతో వైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. జూడాలు విధుల్ని బహిష్కరించి ఆస్పత్రుల వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజీ, పీజీ వైద్యులు 3500 మంది సేవల్ని అందిస్తున్నారు. వీరికి నెలకు వేతనంగా రూ.8200 (యూజీ), రూ.17400 (పీజీ)లకు ఇస్తున్నారు. ఈ జీతాలు చాలడం లేదని, హాస్టళ్లలో కనీస వసతులు లేవని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో యూజీ జూనియర్ డాక్టర్లకు రూ.20 వేలు, పీజీ జూనియర్ డాక్టర్లకు రూ.45 వేలు వేతనాలు ఇస్తుంటే, రాష్ట్రంలో నామమాత్రంగా ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే తమకు ఆ జీతాలు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జూడాలు ఆందోళనకు సిద్ధం అయ్యారు. అప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ వారితో చర్చలు జరిపారు. జీతాలు పెంచాలన్న ఉద్దేశం ఉందని, అందుకు తగ్గ నిధులు లేవంటూ మంత్రి స్పష్టం చేయడం జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జయలలితతో మాట్లాడి నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇవ్వడంతో ఇన్నాళ్లు జూడాలు వేచి చూశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్య శాఖకు సంబంధించిన చర్చలో నిధుల కేటాయింపు, వేతనాల పెంపు ప్రస్తావన తీసుకొస్తారని భావించారు. నిరాశే మిగలడంతో ఒక రోజు సమ్మెకు జూడాల సంఘం పిలుపునిచ్చింది.
సమ్మెతో రోగులకు తంటాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని జూనియర్ డాక్టర్లు ఉదయం విధుల్ని బహిష్కరించి ఒక రోజు సమ్మెకు దిగారు. డీన్ కార్యాలయాల్ని ముట్టడించారు. వేతనాలు పెంచడంతోపాటు సకాలంలో మంజూరు చేయాలని, హాస్టళ్లలో వసతు కల్పించాలని నినదించారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రి, స్టాన్లీ, కీల్పాకం ఆస్పత్రుల్లోని జూనియర్ డాక్టర్లు విధుల్ని బహిష్కరించి ఆందోళలనకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సేవల విభాగంలో పరిస్థితి మరీ దారునంగా మారింది. రెగ్యులర్ డాక్టర్లు తమదైన శైలిలో ఆలస్యంగానే రావడంతోపాటు వ్యక్తిగత పనుల్లోకి వెళ్లడంతో రోగులకు వైద్య సేవలు అందలేదు.
సమస్యలు తీర్చకుంటే నిరంతర సమ్మె
ఒక రోజు తాము చేపట్టిన సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఇక తాము నిరంతర సమ్మెలోకి వెళ్తే అష్టకష్టాలు తప్పవని జూనియర్ డాక్టర్ సంఘం నాయకుడు సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆరు నెలలుగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం హామీలతో కాలయాపన చేస్తుండడం శోచనీయమన్నారు. ఆందోళనలకు దిగినప్పుడల్లా హామీలు ఇచ్చిన బుజ్జగిస్తున్నారు గానీ, వాటి అమలు మీద ఏ ఒక్కరికీ చిత్తశుద్ది లేదని ధ్వజమెత్తారు. వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్న సీఎం జయలలిత తమ గోడును పట్టించుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో వేతన పెంపుపై ప్రత్యేక ప్రకటన చేస్తారన్న ఆశతో ఉన్నామని, లేనిపక్షంలో నిరంతర సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు.