సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఖేహర్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఉదయం ఖేహర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో జస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 8 నెలలపాటు.. ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు మంత్రులు హాజరయ్యారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే తొలిసారి. టీఎస్ ఠాకూర్ పదవీకాలం ఈ నెల 3వ తేదీ (మంగళవారం)తో ముగిసిన విషయం తెలిసిందే.
కాగా జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఎన్‌జేఏసీ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించడంతోపాటు గత జనవరిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనానికి కూడా ఆయనే నేతృత్వం వహించడం గమనార్హం. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్‌ను జైలుకు పంపిన కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇటీవల ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనానికీ ఆయన నేతృత్వం వ్యవహరించారు.