భోపాల్: తండ్రి నిర్ణయం తనకు గర్వకారణమని జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్ సింధియా అన్నాడు. తమ కుటుంబం ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని.. ప్రజాసేవచేయడమే తమకు ముఖ్యమని పేర్కొన్నాడు. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌ను వీడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మహానార్యమన్... ‘‘నాన్న ఈ స్టాండ్ తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఇందుకు ఎంతో ధైర్యం కావాలి. మా కుటుంబానికి అధికార దాహం లేదని చరిత్రే చెబుతోంది. భారత్, మధ్యప్రదేశ్‌లో ప్రభావవంతమైన మార్పు తీసుకువస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం’’ అని ట్వీట్ చేశాడు.(బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ )
కాగా మహానార్యమన్ కూడా తండ్రి బాటలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డెహ్రాడూన్‌లో హై స్కూల్ విద్యనభ్యసించిన మహానార్యమన్.. అమెరికాలో ఎంబీఏ చేశాడు. పార్టీ ప్రచార కార్యక్రమాలకు తండ్రి జ్యోతిరాదిత్యతో కలిసి హాజరైన మహానార్యమన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక సమకాలీన రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే మహానార్యమన్.. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం తన తండ్రి అదే పార్టీలో చేరుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడిన జ్యోతిరాదిత్యాకు కుమారుడు మహానార్యమన్, కుమార్తె అనన్య సింధియా ఉన్న విషయం తెలిసిందే.(కాంగ్రెస్‌కు సింధియా గుడ్‌బై.. ఏం జరుగనుంది?)
I am proud of my father for taking a stand for himself. It takes courage to to resign from a legacy. History can speak for itself when I say my family has never been power hungry. As promised we will make an impactful change in India and Madhya Pradesh wherever our future lies.
— M. Scindia (@AScindia) March 10, 2020
ఇక మంగళవారం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన జ్యోతిరాదిత్య.. అనంతరం ఆయనతో కలిసి ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. చర్చల అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ పంపారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నానని.. ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని సింధియా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది కాబట్టి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నానని తెలిపారు. (ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది)
అదే విధంగా ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి సింధియా బహిష్కరణను సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ తెలిపింది. ఇక సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న సింధియా రాజీనామా చేయడం... ఆయన వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖలు పంపడంతో సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. (సింధియా టైమ్స్)
Comments
Please login to add a commentAdd a comment