ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వి
64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూడిల్లీ: భారతదేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కళాతపస్వి కె. విశ్వనాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను గ్రహీతలకు రాష్ట్రపతి ప్రదానం చేశారు. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, స్వర్ణ కమలం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్, ఉత్తమ నటిగా సురభి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘పెళ్లిచూపులు’ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు తరుణ్ భాస్కర్‌లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రజత కమలం, ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఉత్తమ సంభాషణల కేటగిరీ అవార్డును తరుణ్ భాస్కర్, ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును జనతా గ్యారేజ్ సినిమాకు రాజు సుందరం అందుకున్నారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రం కేటగిరీ కింద ‘శతమానం భవతి’ సినిమాకు గాను దర్శకుడు సతీష్, నిర్మాత వి. వెంకటరమణారెడ్డి(దిల్‌రాజు)లకు స్వర్ణ కమలం, ప్రశంసాపత్రాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. నాన్ ఫీచర్ చిత్రాల విభాగంలో ఉత్తమ సాహసోపేతమైన అం«శాలపై ‘మతిత్లి కుస్తి’ నిర్మాత మాధవి రెడ్డి రజత కమలం, ప్రశంసా పత్రం.. ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రంగా ‘ఫైర్ ఫ్లైస్ ఇన్ ది ఎబిసిస్’ చిత్ర నిర్మాత, దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి స్వర్ణకమలం, ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు కె.విశ్వనాథ్‌పై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
ఫాల్కే అవార్డు అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడారు. ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ఈ శుభ సందర్భంగా పైన ఉన్న నా తల్లిదండ్రులకు, అంతటా ఉన్న భగవంతుడికి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, జ్యూరీ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినోభవంతు’ అంటూ సంక్షిప్తంగా ముగించారు. విశ్వనాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. విలువలు, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిత్రాలను రూపొందించారని కొనియాడారు.
అనుమానాల్లో నిజం లేకపోలేదు..
గతంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు జాతీయ అవార్డులు లభించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు కలిగేవని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. కొన్ని మంచి చిత్రాలకు అవార్డులు రానప్పుడు తమ చిత్ర పరిశ్రమను చిన్న చూపు చూస్తున్నారన్న అనుమానాలు వచ్చేవని, ఇందులో నిజం లేకపోలేదని చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బుధవారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సైకిల్ కూడా ఊహించని వాడికి రోల్స్æరాయిస్ ఇస్తే ఎలా ఉంటుందో... ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఈ పురస్కారాన్ని తనకు ప్రదానం చేస్తుండడం పట్ల ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఇకపై జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా కొనసాగుతుందని జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోని జ్యూరీ సభ్యులు సీవీ రెడ్డి, పీసీ రెడ్డిలు అభిప్రాయపడ్డారు.
గత ఏడాది బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ గుర్తింపు భవిష్యతులో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతాగ్యారేజ్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయన్నారు. మంచి చిత్రాన్ని తీస్తే ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలు ఆదరిస్తారని శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న పేర్కొన్నారు. చిన్న చిత్రంగా తెరకెక్కిన తమ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపును సొంతం చేసుకుందని ‘పెళ్లిచూపులు’ నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రాగినేని పేర్కొన్నారు.