
జాతీయ కబడ్డీ ఆటగాడి భార్య ఆత్మహత్య
న్యూఢిల్లీ: జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ కుమార్ చిల్లర్ భార్య లలిత సోమవారం రాత్రి పడమర జిల్లా అశోక్ మొహల్లా నంగ్లోయ్ ప్రాంతంలోని తన తండ్రి నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటరిగా ఉండటంతో పాటు భర్తతో విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.
ఆమె రాసిన ఆత్మహత్య లేఖలో బలవంతంగా ఒంటరిగా ఉండటంతో పాటు, ఇటీవల నగరంలో జరిగిన కబడ్డీ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఆటగాడైన తన భర్త రోహిత్‌ను చూసేందుకు వెళ్లగా జరిగిన పరిణామాలకు అసంతృప్తితో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) విజయ్ కుమార్ తెలిపారు.
గతేడాది మార్చిలో లలిత.. చిల్లర్‌ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. లేఖలో తన భర్త ఆనందం కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. సమాచారాన్ని రోహిత్‌కు తెలియజేయగా, ఆయన ముంబైలో ఉన్నాడని డీసీపీ పేర్కొన్నారు.