కళ్యాణ్ జువెల్లర్స్ యాడ్‌లో అమితాబ్ బచ్చన్, శ్వేతా నందా
కొచ్చి : ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) డిమాండ్ మేరకు తాము రూపొందించిన యాడ్‌ను అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా బచ్చన్ నందాలతో రూపొందించిన యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉందంటూ బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యాడ్‌ను తొలగించనున్నట్లు కళ్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు.
‘కేవలం ప్రచారం కోసం రూపొందించిన మా కంపెనీ యాడ్ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా మా వ్యాపారంలో కీలక పాత్ర పోషించే బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తున్నాం. అందుకే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్‌ను తొలగిస్తున్నామంటూ’ ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా నందా తొలిసారి కళ్యాణ్ జువెల్లర్స్ కోసం ఓ యాడ్‌లో నటించారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో కళ్యాణ్ జువెల్లర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment