తురుపుముక్కను తీసుకుంటే పోలా..!
హెచ్‌సీయూ, ఆ తర్వాత జేఎన్‌యూలో చోటు చేసుకున్న పరిణామాలు కొత్త సమీకరణాలకు తెరతీస్తాయనే ఆశాభావంలో ఆయా రాజకీయపార్టీల నాయకులున్నారట. జేఎన్‌యూ వివాదంతో ప్రాచుర్యంలోకి వచ్చి, దేశద్రోహం కేసుపై అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్‌పై విడుద లైన తర్వాత మీడియాలో, ప్రజల్లో ఆయన ఇమేజీ బాగా పెరిగిందని, దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటే ఎలా ఉంటుందా అన్న చర్చ ఆయా పార్టీల్లో సాగుతోందట. జాతీయ రాజకీయాల్లోకి కన్హయ్యను తీసుకురావాలనుకుంటే కేవలం విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌కో, సీపీఐకో పరిమితం చేస్తే ప్రయోజనం ఉండదని అంటున్నారట. సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అని జాతీయస్థాయిలో కొందరు నాయకులు గట్టిగానే తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించారట.
కన్హయ్యతో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గతంలో సమావేశమైన విషయాన్ని, జేఎన్‌యూ, హెచ్‌సీయూలలో జరిగిన నిరసనలో ఆయన స్వయంగా పాల్గొనడాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో కన్హయ్య ఇమేజీని జాతీయస్థాయిలో వాడుకుంటే బావుంటుందని, ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రతిపాదనలను కూడా రాహుల్‌గాంధీ వద్దకు తీసుకెళ్లారట. అయితే ఇవి ఇంకా ప్రతిపాదనల స్టేజీలోనే ఉండడం, కాంగ్రెస్ నాయకత్వం దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై ఒకింత చర్చ జరుగుతోందట. ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా తురుపు ముక్కగా కన్హయ్య ఉపయోగపడతాడని కూడా ఆ నేతలు పెద్ద ఆశలే పెట్టుకున్నారట.