kanhaiahkumar
-
ఇప్పటికి బాణాలు చాలు.. అవసరమైతే త్రిశూలం తీస్తా: మాధవీ లత
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి మాధవీ లత ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి తరపున దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ నేత మాధవీ లత ఢిల్లీలోని బహిరంగ సభ వేదికపైకి రాగానే అక్కడున్న పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనోజ్ తివారీపై పోటీ చేస్తున్న వ్యక్తి పేరు కన్హయ్య అని, అయితే అతని దోపిడీలు చాలా క్రూరమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడిని ప్రస్తావించిన ఆమె.. వేధించిన వ్యక్తిని రక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డుపైకి వచ్చారని ఆరోపించారు. బీహార్ యువత ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారి దేశానికి సేవ చేస్తుంటారని, అయితే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇలాంటి వారిని మోసం చేశారని మాధవీ లత ఆరోపించారు.ఢిల్లీలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజల మధ్య, కేజ్రీవాల్ రెండు రోజులు తిరగాలని, అప్పుడే అతనికి ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయని ఆమె అన్నారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులకు కేజ్రీవాల్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫలితంగా బురారీ ప్రజలు బురద, చెత్త మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆమె ఆరోపించారు. అయితే ఇలాంటి బురదలో నుంచి వికసించిన కమలాన్నే దేవుని పాదాల చెంత ఉంచుతారన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతునివ్వాలని ఆమె ఓటర్లను కోరారు.తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు సంధించిన ఆమె.. ప్రస్తుతానికి ఈ బాణాలు చాలని, అవసరమైతే వారిపై త్రిశూలాన్ని కూడా ప్రయోగించడానికి వెనుకాడనని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి మద్దతుగా మాధవీ లత బురారీలోని వెస్ట్ కమల్ విహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. -
కన్హయ్య కుమార్ (కాంగ్రెస్) రాయని డైరీ
రాహుల్‌గాంధీలో కొంచెమైనా అలసట కనిపించడం లేదు! అప్పటికే ఆయన తనతో పాటుగా మమ్మల్ని దేశానికి దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి ఉత్తర దిక్కున ఉన్న కశ్మీర్ వైపుగా 12–13 కిలోమీటర్ల దూరం నడిపించి ఉంటారు! ‘‘మరొక 12–13 కి.మీ. నడుద్దాం’’ అన్నారు రాహుల్.. నడుస్తూ నడుస్తూనే. ఆ సంకల్ప బలమే సీనియర్ నాయకుల్ని సైతం ఉత్సాహంగా నడిపిస్తోంది. ‘‘అలాగే రాహుల్‌బాబూ! మరో 12–13 కి.మీ నడుద్దాం..’’ అన్నారు దిగ్విజయ్‌సింగ్.. రాహుల్ వేగాన్ని అందుకుంటూ! దిగ్విజయ్ వేగాన్ని అశోక్ గెహ్లోత్ అందుకున్నారు. అశోక్ గెహ్లోత్ వేగాన్ని భూపేశ్ భగేల్ అందుకున్నారు. భూపేశ్ భగేల్ వేగాన్ని జైరాం రమేశ్ అందుకున్నారు. వాళ్లందరి వెనుక నేను నడుస్తున్నాను. ‘‘ఓయ్ కన్హయ్యా! ఏంటా పెళ్లి నడక.. స్పీడప్ స్పీడప్..’’ అంటున్నారు భూపేశ్ భగేల్ నా వైపు చూసి నవ్వుతూ. కాంగ్రెస్‌కు ప్రస్తుతం మిగిలి ఉన్న ఇద్దరు సీఎంలలో ఆయన ఒకరు. జోడో యాత్రలో నా డ్యూటీ నడవడం మాత్రమే కాదు. అందరికన్నా వేగంగా నడవాలి, అందరికన్నా వెనక నడవాలి. ‘‘మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే మీ వెనుకే కదా నడవాలి భగేల్‌జీ..’’ అన్నాను నా నడక వేగాన్ని పెంచీ పెంచకుండా.‘‘అద్సరే భగేల్, పెళ్లి నడక అంటావేంటి? కన్హయ్యకు పెళ్లెప్పుడైందీ మనకు తెలీకుండా...’’ అన్నారు గెహ్లోత్ పెద్దగా నవ్వుతూ. కాంగ్రెస్‌కు మిగిలిన ఇద్దరు సీఎంలలో ఆయన ఇంకొకరు. ‘‘హాహ్హాహా.. పెళ్లి కాని వారు పెళ్లి నడక నడవరంటావా గెహ్లోత్జీ..’’ అన్నారు భగేల్! ఆ టాపిక్‌ని అక్కడే ఆపనివ్వకపోతే ముందు వరుసలో నడుస్తున్న వారి వరకు వెళ్లేలా ఉంది. ‘‘గెహ్లోత్జీ! నాకొకటి అనిపిస్తోంది. దేశం రెండు కమతాలుగా విడిపోవడానికి మహమ్మద్ అలీ జిన్నా కారణం అయితే, దేశం రెండు మతాలుగా విడిపోవడానికి మన మోదీజీ కారణం అవుతున్నారు కదా..’’ అన్నాను. ‘‘ఇందులో కొత్తగా అనిపించడానికి ఏముంది కన్హయ్య కుమార్!’’ అన్నారు గెహ్లోత్. ‘‘మతాలు, కమతాలు! మంచి రిథమ్ ఉంది కన్హయ్యా నీలో. రిథమ్ ఉండీ పెళ్లెందుకు చేసుకోలేదు?’’ అని నవ్వారు భగేల్! పెళ్లి టాపిక్ పక్కదోవ పట్టేందుకు ఇద్దరూ ఇష్టపడటం లేదు! పాదయాత్ర బ్రేక్‌లో తొలిరోజు రాత్రి నాగర్‌కోయిల్‌లోని స్కాట్ క్రిస్టియన్ కాలేజ్ గ్రౌండ్లో స్టే చేశాం. స్నానాలు, భోజనాలు అయ్యాక సీనియర్ నాయకులంతా గ్రౌండ్ లోపల నిలిపిన కంటెయినర్లలోకి వెళ్లిపోయారు. నేను, కొంతమంది యూత్ లీడర్లు గ్రౌండ్లో ఆరుబయటే మసక చీకటిలో టార్పాలిన్లపై విశ్రమించాం. ‘‘మనమింకా ఎంతదూరం ప్రయాణించాలి కన్హయ్యా..’’ అని నా పక్కనే విశ్రమించి ఉన్న వారెవరో అలసటగా అడిగారు! పాదయాత్ర మొదటి రోజే ఆ మాట అడిగిందెవరా అని చూశాను. పి.చిదంబరం! ‘‘సార్! మీరా? మీరేమిటి ఈ ఆరుబయట?!’’ అన్నాను. ‘‘నాకు ఏసీ పడదు కన్హయ్యా! అందుకే కంటెయినర్లలోకి వెళ్లలేదు. సరే ఇది చెప్పు. కశ్మీర్ ఇక్కడికి ఇంకా ఎంత దూరం?’’ అని అడిగారు చిదంబరం!! ‘‘పెద్ద దూరమేం కాదు చిదంబరంజీ. ఇప్పుడు నాగర్‌కోయిల్‌లో ఉన్నామా.. తర్వాత తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూర్, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా, అల్వాల్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్.. ఆ తర్వాత జమ్ము, శ్రీనగర్.. అంతే!’’ అన్నాను. ‘‘అంతేనా! మధ్యలో ఏం మిస్సవలేదు కదా!!’’ అన్నారు చిదంబరం. లేదన్నట్లుగా ఆయన వైపు చూసి నవ్వాను. నిజంగానే మధ్యలో ఏం మిస్సవలేదు. మధ్యలో ఎవరైనా మిస్ అవుతారేమో తెలీదు. -
తురుపుముక్కను తీసుకుంటే పోలా..!
హెచ్‌సీయూ, ఆ తర్వాత జేఎన్‌యూలో చోటు చేసుకున్న పరిణామాలు కొత్త సమీకరణాలకు తెరతీస్తాయనే ఆశాభావంలో ఆయా రాజకీయపార్టీల నాయకులున్నారట. జేఎన్‌యూ వివాదంతో ప్రాచుర్యంలోకి వచ్చి, దేశద్రోహం కేసుపై అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్‌పై విడుద లైన తర్వాత మీడియాలో, ప్రజల్లో ఆయన ఇమేజీ బాగా పెరిగిందని, దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటే ఎలా ఉంటుందా అన్న చర్చ ఆయా పార్టీల్లో సాగుతోందట. జాతీయ రాజకీయాల్లోకి కన్హయ్యను తీసుకురావాలనుకుంటే కేవలం విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్కో, సీపీఐకో పరిమితం చేస్తే ప్రయోజనం ఉండదని అంటున్నారట. సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అని జాతీయస్థాయిలో కొందరు నాయకులు గట్టిగానే తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించారట. కన్హయ్యతో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గతంలో సమావేశమైన విషయాన్ని, జేఎన్‌యూ, హెచ్‌సీయూలలో జరిగిన నిరసనలో ఆయన స్వయంగా పాల్గొనడాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో కన్హయ్య ఇమేజీని జాతీయస్థాయిలో వాడుకుంటే బావుంటుందని, ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రతిపాదనలను కూడా రాహుల్‌గాంధీ వద్దకు తీసుకెళ్లారట. అయితే ఇవి ఇంకా ప్రతిపాదనల స్టేజీలోనే ఉండడం, కాంగ్రెస్ నాయకత్వం దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై ఒకింత చర్చ జరుగుతోందట. ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా తురుపు ముక్కగా కన్హయ్య ఉపయోగపడతాడని కూడా ఆ నేతలు పెద్ద ఆశలే పెట్టుకున్నారట.