ఇప్పటికి బాణాలు చాలు.. అవసరమైతే త్రిశూలం తీస్తా: మాధవీ లత | Madhavi Lata To Campaign For North East Candidate Manoj Tiwari | Sakshi
Sakshi News home page

ఇప్పటికి బాణాలు చాలు.. అవసరమైతే త్రిశూలం తీస్తా: మాధవీ లత

Published Mon, May 20 2024 10:33 AM | Last Updated on Mon, May 20 2024 10:55 AM

Madhavi Lata To Campaign For North East Candidate Manoj Tiwari

దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ  నేపధ్యంలో రాజకీయ నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి మాధవీ లత ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్‌ తివారి తరపున దేశ రాజధానిలో ‍ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.  

బీజేపీ నేత మాధవీ లత ఢిల్లీలోని బహిరంగ సభ వేదికపైకి రాగానే  అక్కడున్న పార్టీ కార్యకర్తలు  ‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనోజ్ తివారీపై పోటీ చేస్తున్న వ్యక్తి పేరు కన్హయ్య అని, అయితే అతని దోపిడీలు చాలా  క్రూరమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడిని ప్రస్తావించిన ఆమె.. వేధించిన వ్యక్తిని రక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రోడ్డుపైకి వచ్చారని ఆరోపించారు. బీహార్ యువత  ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారి దేశానికి సేవ చేస్తుంటారని, అయితే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇలాంటి వారిని మోసం చేశారని మాధవీ లత ఆరోపించారు.

ఢిల్లీలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజల మధ్య, కేజ్రీవాల్ రెండు రోజులు తిరగాలని, అప్పుడే అతనికి ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయని ఆమె అన్నారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులకు కేజ్రీవాల్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఫలితంగా బురారీ ప్రజలు బురద, చెత్త మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆమె ఆరోపించారు. అయితే ఇలాంటి బురదలో నుంచి వికసించిన కమలాన్నే దేవుని పాదాల చెంత  ఉంచుతారన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతునివ్వాలని ఆమె ఓటర్లను కోరారు.

తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు సంధించిన ఆమె.. ప్రస్తుతానికి ఈ బాణాలు చాలని, అవసరమైతే వారిపై త్రిశూలాన్ని కూడా ప్రయోగించడానికి వెనుకాడనని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి మద్దతుగా మాధవీ లత బురారీలోని వెస్ట్ కమల్ విహార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement