కన్హయ్యకు వెంకయ్య రాజకీయ సలహా!
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో జైలు పాలై.. బెయిల్ పై విడుదలైన జెఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్‌పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కన్హయ్యకు బాగా పబ్లిసిటీ వచ్చిందని, కాబట్టి ఆయన రాజకీయాల్లో చేరవచ్చునంటూ సలహా ఇచ్చారు. అయితే కన్హయ్య చేరే పార్టీ పార్లమెంటులో సింగిల్ డిజిట్‌లో ఉందంటూ ఎద్దేవా చేశారు.
'అతనికి బాగా పబ్లిసిటీ వస్తుంది. కాబట్టి అతను రాజకీయాల్లో చేరవచ్చు. అతని ఫేవరేట్ రాజకీయ పార్టీ ప్రస్తుతం పార్లమెంటులో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది' అని వెంకయ్య అన్నారు. జెఎన్‌యూలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్హయ్యకుమార్ అరెస్టయ్యారు. దాదాపు మూడు వారాలు జైలులో గడిపిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య గురువారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన జాతివ్యతిరేక నినాదాలు చేసినట్టు వీడియో ఆధారాలు లేవని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు స్పషం చేసింది.