
తమిళనాడుకు 3వేల క్యూసెక్కులు
విడుదల చేయాలని కర్ణాటకకు కావేరి కమిటీ ఆదేశం
సాక్షి, బెంగళూరు: కావేరి నదీజలాల వివాద పరిష్కారం దిశగా.. ఈనెల 21 నుంచి 30 వరకు రోజుకు 3000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను కావేరీ పర్యవేక్షక కమిటీ ఆదేశించింది. కేంద్ర జలవనరుల కార్యదర్శి శశిశేఖర్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన కావేరీ పర్యవేక్షణ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమనుకుంటే ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టులో సవాలు చేసుకొనే స్వేచ్ఛ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉందని శశిశేఖర్ అన్నారు. కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు, తాగు, సాగు నీటి అవసరాలు, 4 జలాశయాల్లో సగటు ఇన్‌ఫ్లో, తమిళనాడులో వేసవి పంటలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
అక్టోబరులో కమిటీ మరోసారి మావేశమవుతుందన్నారు. కావేరి సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కావేరి పరివాహక ప్రాంతంలో వర్షపాతం, జలాశయాల్లో నీటి మట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను గణించడానికి ‘రియల్ టైం ఆన్‌లైన్ డేటా నమోదు’ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడుకు చుక్క నీరు వదలడానికి వీలుకాదని కర్ణాటక ప్రధాన కార్యదర్శి జాదవ్ వాదించారు. కావేరి ట్రైబ్యునల్ గత ఆదేశాలను అనుసరించి తమకు నీరివ్వాల్సిందేనని తమిళనాడు వాదించింది. కమిటీ నిర్ణయంపై మంగళవారం సుప్రీంకోర్టులో సవాలుచేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.