‘కంబళ’ బిల్లుకు ఆమోదం
బెంగళూరు: కరావళి ప్రాంత సాంస్కృతిక క్రీడ కంబళ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర వేసింది. గతంలో చెప్పినట్లుగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లుపై చర్చించి పాస్ చేశారు. దీని ప్రకారం జీవహింస నిరోధక చట్టాల్లో సవరణలు చేస్తారు. దీనికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేకపోలేదు. జల్లికట్టుకు అడ్డుకట్టపడినట్లుగానే కంబళకు కూడా కర్ణాటక హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.
దీంతో తమిళనాడు మాదిరిగానే కర్ణాటకలో కూడా పెద్ద మొత్తంలో నిరసనలు బయలుదేరాయి. దీంతో ఈ గ్రామీణ క్రీడలో ఎలాంటి జీవహింస ఉండదని,ఆధ్యాత్మిక భావనతో ముడిపడిన కంబళ క్రీడను నిర్వహించుకోవడానికి గతంలోనే ప్రభుత్వం అనుమతిచ్చిందని, దీని నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు త్వరలోనే చట్ట సవరణ బిల్లును తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ మాట ప్రకారం సవరణలు కోరే బిల్లును సోమవారం పాస్ చేసింది.