కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(ఫైల్‌ఫొటో)
బెంగళూరు: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాపిస్తున్న తరుణంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఓ వివాహానికి హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్సీ మహాంతేశ్ కవాటగిమత్ కూతురి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో మొట్టమొదటి మరణం కర్ణాటక రాష్ట్రంలో సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాల్స్, సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా జనసమ్మర్ధం ఉన్న చోటకు వెళ్లరాదని.. పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని.. అలా కుదరని పక్షంలో కేవలం 100 మంది కంటే తక్కువ అతిథుల మధ్య తంతు జరిపించాలని ఆదేశించింది.(కరోనా తొలి మరణం: కర్ణాటక యాక్షన్ ప్లాన్!)
ఈ క్రమంలో ఆదివారం బెలగావిలో జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ మహంతేశ్ కవాటగిమత్ కుమార్తె వివాహానికి పెద్ద ఎత్తున అతిథులు హాజరుకావడం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సీఎం యడియూరప్ప ఈ వేడుకకు హాజరవడం పట్ల భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎగ్జిబిషన్లు, సమ్మర్ క్యాంపులు, సమావేశాలు, పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, క్రీడా ఈవెంట్లు ఇలా అన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఇలా ఆడంబరంగా జరిగే వివాహానికి రావడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ప్రజలకు మాత్రమేనా.. నాయకులకు ఉండవా అని మండిపడుతున్నారు. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య సోమవారం నాటికి 118కి చేరింది. ఇక దేశంలో తొలి కరోనా మరణం కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకోగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ ఈ మహమ్మారి కారణంగా మృత్యువాతపడ్డారు.(కరోనా: సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment