బెంగళూరు: కర్ణాటకలోని అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు, యెడ్యూరప్ప నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారిన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 15 నియోజకవర్గాల్లోని మొత్తం 37.78 లక్షల మంది ఓటర్లలో సాయంత్రం 6 గంటల వరకు 66.59% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. హోసకోటెలో అత్యధికంగా 90.44%, కృష్ణరాజపురంలో అత్యల్పంగా 43.25% పోలింగ్ నమోదైందని తెలిపారు. బెంగళూరు పరిధిలోని మహాలక్ష్మి లేఅవుట్‌లో 50.92%, శివాజీనగరలో 44.60%, యశ్వంత్‌పురలో 54.13% పోలింగ్ నమోదైందన్నారు.
ఈ నెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే సీఎం యెడ్యూరప్ప 15 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లోను, జేడీఎస్ 12 చోట్ల పోటీలో ఉంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. కోర్టు కేసులున్నందున మస్కి, రాజరాజేశ్వరి నగర నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. ఈ ఉప ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీజేపీనే గెలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 15 స్థానాల్లో, బీజేపీకి 10, కాంగ్రెస్‌కు 2 నుంచి 4, జేడీఎస్ 2 సీట్లు లభిస్తాయని పలు సర్వేలు అంచనా వేశాయి. ఈ 15 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 12, జేడీఎస్ 3 సీట్లలో గెలుపొందాయి.
ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికలు
Published Fri, Dec 6 2019 2:06 AM | Last Updated on Fri, Dec 6 2019 2:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment