Bye-Election
-
ప్రజా తీర్పును గౌరవిస్తూ సిద్ధూ రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే తాను సీఎల్పీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా శాసనసభ ప్రతిపక్ష హోదా పదవికి కూడా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 13 స్థానాలను కైవం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో నాలుగు నెలల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వ్యవహారం ఎన్నికల ఫలితాలతో ముగిసింది. చదవండి: ‘కన్నడ నాట ఇక సుస్థిర సర్కార్’ -
ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికలు
బెంగళూరు: కర్ణాటకలోని అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు, యెడ్యూరప్ప నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారిన 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 15 నియోజకవర్గాల్లోని మొత్తం 37.78 లక్షల మంది ఓటర్లలో సాయంత్రం 6 గంటల వరకు 66.59% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. హోసకోటెలో అత్యధికంగా 90.44%, కృష్ణరాజపురంలో అత్యల్పంగా 43.25% పోలింగ్ నమోదైందని తెలిపారు. బెంగళూరు పరిధిలోని మహాలక్ష్మి లేఅవుట్లో 50.92%, శివాజీనగరలో 44.60%, యశ్వంత్‌పురలో 54.13% పోలింగ్ నమోదైందన్నారు. ఈ నెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే సీఎం యెడ్యూరప్ప 15 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లోను, జేడీఎస్ 12 చోట్ల పోటీలో ఉంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. కోర్టు కేసులున్నందున మస్కి, రాజరాజేశ్వరి నగర నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. ఈ ఉప ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీజేపీనే గెలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 15 స్థానాల్లో, బీజేపీకి 10, కాంగ్రెస్‌కు 2 నుంచి 4, జేడీఎస్ 2 సీట్లు లభిస్తాయని పలు సర్వేలు అంచనా వేశాయి. ఈ 15 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 12, జేడీఎస్ 3 సీట్లలో గెలుపొందాయి. -
మెజార్టీ కోసమే ప్రచారం
కొండపాక: వెలికట్ట ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి దివంగత ఎంపీటీసీ బూర్గుల యాదంరావు భార్య మల్లవ్వ గెలుపు పార్టీ బి- ఫారం తీసుకున్నప్పుడే ఖాయమైందని, భారీ మెజార్టీ కోసమే ప్రచారం నిర్వహిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య పేర్కొన్నారు. ఉపఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం వెలికట్ట , జప్తినాచారం, ఆరెపల్లి, రవీంద్రనగర్, రాజంపల్లిలో మండల టీఆర్ఎస్ నాయకులు మల్లవ్వ తరుపున ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో వారు మాట్లాడుతూ గతంలో వెలికట్ట ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన యాదంరావు అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరారన్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైందన్న విషయాన్ని ఓటర్లు గుర్తిస్తారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలికట్టకు మంజూరు చేసినన్ని నిధులు మండలంలో ఏ గ్రామానికి మంజూరు చేయలేదన్నారు. అకార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే వెలికట్ట ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలు మరింత అభివృద్ధిచెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గొడుగు యాదగిరి, కనకారెడ్డి, యాదయ్య, పసుల సరిత, ఎంపీపీ ఉపాధ్యక్షుడు బైరెడ్డి రాదాకిషన్‌రెడ్డి, నాయకులు అనంతుల నరేందర్, బాల్‌చందర్‌గౌడ్ , అంజి, జైన్ ఆంజనేయులు, అమరేందర్, శ్రీనివాస్‌రెడ్డి, పెరుగు ఆంజనేయులు, కొండు రవి, మీస రాజయ్య తదితరులు పాల్గొన్నారు.