ఆ కలతో..అపార నిధికి అన్వేషణ!
► చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ ప్రాచీన భవనాల్లో నిక్షేపాలు
► తుమకూరు యువకునికి కల
► సీఎంకు లేఖతో కార్యాచరణ
శివాజీనగర(కర్ణాటక): ప్రాచీన భవనాలలో అపార స్థాయిలో నిధి ఉందని తుమకూరుకు చెందిన ఓ యువకుడు కన్న కల నిధి వేటకు దారితీసింది. అది కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యదర్శి ఎల్.కే.అతీక్, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి, రహస్య నిధి కోసం గాలించాలని సూచించారు. చిత్రదుర్గ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ కూడా దీనిపై కన్నడ సంస్కృతి శాఖకు లేఖ రాసినట్లు వెలుగు చూసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే...
‘చిత్రదుర్గ జిల్లాలోని హొసదుర్గ తాలూకాలో ప్రాచీన భవనాల్లో అపారమైన నిధి ఉంది. 2 బంగ్లాల్లో ఆరు గదుల్లో అపారమైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు’ నాకు కలలో వచ్చింది. ఈ రహస్య బంగ్లాలో శోధిస్తే లభించే అపారమైన నిధిని రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చు’ అని తుమకూరుకు చెందిన 29 ఏళ్ల ప్రద్యుమ్న యాదవ్ అనే యువకుడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొంతకాలం కిందట లేఖ రాశాడు. దాని ఆధారంగా జరుగుతోంది. 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన యదునందనా చిత్ర భూపాల సామ్రాట్ తన సామ్రాజ్యంపై శత్రువుల దాడి జరగడానికి ముందు అపారమైన బంగారు ఆభరణాలను ఈ భవనాల్లో దాచిపెట్టినట్లు కల వచ్చిందని యాదవ్ చెబుతున్నాడు. యువకుడు చెప్పిన కలలో నిజమెంతో తెలుసుకోవాలనుకున్న ప్రభుత్వం ప్రాచీన బంగ్లాల్లో పరిశీలనలను జరపాలని ఆదేశించినట్లు సమాచారం.