
కావేరిపై బెట్టువీడిన కర్ణాటక.. నీటి విడుదల
న్యూఢిల్లీ: ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం తన బెట్టు వీడింది. తమిళనాడుకు కావేరి జలాలను విడిచిపెట్టింది. అయితే, ఎంతమొత్తంలో విడిచిపెడుతున్నదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సోమవారం రాత్రి ఈ నీటిని విడుదల చేసినట్లు సమాచారం. మరోపక్క, ఈ జలాల విడుదల విషయంపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం రెండుసార్లు భేఖాతరు చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం కుదరదని, ఒక వేళ ఇవ్వాల్సి వచ్చినా డిసెంబర్లో మాత్రమే ఇస్తామని కర్ణాటక సుప్రీంలో పిటిషన్ వేయగా దానిని కోర్టు నిరాకరించింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని చెప్పడంతోపాటు కేంద్రాన్ని కావేరి జలాలపై ప్రత్యేక నిర్వహణ బోర్డును ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం సుదీర్ఘంగా భేటీ అయిన కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసేందుకు తీర్మానం చేసింది. అయితే, తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు, తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేస్తామని ఎంత నీటిని విడుదల చేస్తారో చెప్పకుండానే తన నిర్ణయాన్ని వెలువరించింది. ఆ ప్రకారమే రాత్రి నీళ్లను విడిచిపెట్టింది.