కార్తీకి మరో దెబ్బ
Published Fri, Sep 1 2017 12:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు మరో షాక్ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కార్తీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం పాత్రపై ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫారినర్ రిజీయనల్ రిజిస్ట్రేషన్ శాఖ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం వాటిపై స్టే విధిస్తూ ఆదేశాలివ్వగా, సీబీఐ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కార్తీని ఇండియాను వదిలి వెళ్లకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తూ సెప్టెంబర్ 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. లుక్ అవుట్ తేదీని కూడా సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది.
2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాకు కేటాయింపుల విషయంలో అవకతవకలు వెలుగులోకి రాగా, పెద్ద స్కాం బయటపడింది. విచారణలో భాగంగా పదేళ్ల తర్వాత కార్తీ పాత్ర వెలుగు చూడటంతో ఉందంటూ ఈ యేడాది మే 16న కార్తీ నివాసంతోపాటు ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛండీగఢ్ లలో మొత్తం 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కార్తీతోపాటు ఐఎన్‌ఎక్స్ మీడియా అధిపతులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Advertisement
Advertisement