సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే చీఫ్, రాజకీయ కురువృద్ధుడు ఎం. కరుణానిధి (94) ఆరోగ్యం మళ్లీ విషమించింది. మరో 24 గంటలపాటు కరుణ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి వైద్యులు సోమవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శరీర అవయవాలు సరిగ్గానే పనిచేస్తున్నప్పటీ వృద్ధాప్య సమస్యలు ఆయన కోలుకునేందుకు సవాల్‌గా మారాయని హెల్త్ బులెటిన్ పేర్కొంది.
‘వచ్చే 24 గంటలపాటు వైద్య సేవలకు ఆయన శరీరం ఎలా సహకరిస్తుందనేదే కీలకం’ అని కావేరీ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ స్పష్టం చేశారు. ఐదుసార్లు తమిళనాడు సీఎంగా ఉన్న కరుణానిధి రక్తపోటు తగ్గడంతో గత నెల 28 అళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. కరుణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఆనందంలో మిఠాయిలు పంచుకున్న కార్యకర్తలు.. ఆయన సీరియస్‌గా ఉన్నారన్న వార్తలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఆసుపత్రి ముందుకు చేరుకుని ఆయన కోలుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు.
అయితే తమ నేత తిరిగి కోలుకుంటారని అన్ని ఆరోగ్యపరమైన అడ్డంకులను అధిగమించి విజేతగా నిలుస్తాడంటూ ఆసుపత్రి ముందు కొందరు అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. భారీ సంఖ్యలో మహిళలు కూడా ఆసుపత్రి ముందు రోదిస్తూ కూర్చున్నారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో చెన్నైలో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అభిమానుల తాకిడి పెరగటంతో ఆసుపత్రి ముందు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కరుణ కుటుంబ సభ్యులు, డీఎంకే ముఖ్యనేతలు ఆసుపత్రిలో ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సోమవారం కేంద్ర మంత్రి గడ్కరీ కరుణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కరుణానిధి చికిత్సపొందుతున్న ఆస్పత్రి బయట గుమిగూడిన అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment