కశ్మీరం కడుదయనీయం | Kashmir curfew brings summer capital to grinding halt | Sakshi
Sakshi News home page

కశ్మీరం కడుదయనీయం

Published Sat, Aug 27 2016 3:53 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

కశ్మీరం కడుదయనీయం

కశ్మీరం కడుదయనీయం

శ్రీనగర్ రోజంతా కర్ఫ్యూ..
రాళ్లు రువ్వుకోవటాలు.. టియర్ గ్యాస్ షెల్స్ శబ్దాలతో బయటకు రావాలంటే నరకం..
రాత్రి అయిందంటే.. ఎవరు ఎటువైపు నుంచి వచ్చి మీదపడతారో తెలియని భయం..
ఇదీ అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు రాలేకపోతున్న కశ్మీరీల నరకయాతన..

అస్తిత్వం చాటుకునేందుకు ఒకరు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరొకరు.. తమ ఆధిపత్యం కోసం చేస్తున్న పోరులో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా శ్రీనగర్‌లో పరిస్థితి దారుణం. జూలై 8 నుంచి నిరంతరాయంగా కర్ఫ్యూ అమలుతో.. అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు రాలేక అష్టకష్టాలు పడుతున్నారు. ‘ఒకరోజో.. రెండ్రోజులో అయితే.. సరే అనుకోవచ్చు. ఇది మా జీవితంలో భాగమైపోయింది’ అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ‘మా అత్తమ్మకు ఆరోగ్యం బాగా లేదని నా దగ్గరున్న మందులిచ్చేందుకు బయటికెళ్లా.. అరకిలోమీటరు కూడా లేని దూరానికి గల్లీల గుండా.. రెండు కిలోమీటర్లకు పైగా తిరిగి భయం భయంగా వెళ్లాల్సివచ్చింది’ అని ముస్తాక్ మిర్ అనే యువకుడు చెప్పాడు. అల్లర్లకు పాల్పడుత్నున యువకుల నుంచి మరింత ఇబ్బందికర సమస్యలు ఎదురవుతున్నాయన్నాడు. ‘కొందరు కుర్రాళ్లు రోడ్లపై తిరుగుతున్నారు. వాళ్ల చేతుల్లో లాఠీలు, పెట్రోల్, కిరోసిన్ నింపిన బాటిళ్లు, రాళ్లు ఉన్నాయి. నేను, నా భార్యతో కలిసి గల్లీలోంచి వెళ్తుంటే అడ్డుకుని.. కొట్టారు. తర్వాత పరిస్థితి చెప్పినా.. నా పూర్తి వివరాలు సరిపోయాకే వదిలిపెట్టారు’ అని ముస్తాక్ బాధగా తెలిపారు. మనం చెప్పేది వినేందుకు కూడా వీరికి ఓపిక ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ముస్తాక్ సమస్య మాత్రమే కాదు. సగటు కశ్మీరీ ఆవేదన.

మాకూ మానవత్వం ఉంది
అయితే.. కాస్తలో కాస్త భద్రతా బలగాలే నయం అంటున్నారు స్థానికులు. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే.. ముందుగా బెదిరించి ఆ తర్వాతైనా సహాయం చేస్తారని.. అల్లరి మూకలు తమ పరిస్థితిని కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదంటున్నారు. అటు ఆర్మీ అధికారులు కూడా.. ‘మేమేం కర్కశులం కాదు. పరిస్థితిని బట్టి కశ్మీరీలకు సాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్సనందిస్తున్నాం’ అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.

‘ఓ యువకుడు తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చి.. ఇంటికెళ్తుంటే.. అల్లరిమూక అతన్ని చుట్టుముట్టింది. అతని గుర్తింపు కార్డు, ఆసుపత్రి బిల్లు చూపినప్పటికీ చితగ్గొట్టింది. తర్వాత రోడ్డుపైనున్న మా క్యాంపు వరకు తీసుకొచ్చి.. మాపై రాళ్లు రువ్వమన్నారు. అలా చేశాకే తనను వదిలిపెట్టారు’ అని భద్రతదళ అధికారి తెలిపారు. నిత్యావసరాలు అందక, అత్యవసరానికి బయటకు వెళ్లలేక.. సరుకులు అయిపోతుంటే.. రేపటి పరిస్థితేంటనే ప్రశ్న ఆ కుటుంబాలను వేధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement