జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
ఇద్దరు ఉగ్రవాదుల హతం.. ఓ కానిస్టేబుల్ మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలకూ.. ఉగ్రవాదులకూ మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుమారు 12 గంటల పాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కాల్పులు ఆదివారం ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగాయి.
ఈ కాల్పుల్లో యూరీకి చెందిన పోలీసు కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్ చనిపోయాడు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఆకీబ్ భట్ అలియాస్ ఆకీబ్ మౌల్వీగా గుర్తించారు. మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఇతను యాక్టివ్‌గా పనిచేస్తున్నట్టు భద్రతా బలగాలు చెపుతున్నాయి. మరో ఉగ్రవాదిని సైఫుల్లా అలియాస్ ఒసామాగా గుర్తించారు. పాకిస్తాన్ కు చెందిన సైఫుల్లా జేషే మహమూద్ ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేస్తున్నట్టు తెలిపాయి.